సూడాన్‌‌లో డ్రోన్ దాడి.. 24 మంది మృతి

సూడాన్‌‌లో డ్రోన్ దాడి.. 24 మంది మృతి
  • చనిపోయిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు
  • ఉత్తర కొర్డోఫాన్‌‌లో ఘోరం

కైరో: సూడాన్‌‌లోని ఉత్తర కొర్డోఫాన్ ప్రావిన్స్‌‌లోని రహద్ సమీపంలో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) అనే పారామిలిటరీ గ్రూప్ శనివారం చేసిన డ్రోన్ అటాక్​లో 24 మంది మృతిచెందారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు కాగా.. వీరిలో ఇద్దరు నవజాత శిశువులు. తీవ్ర అల్లకల్లోలంగా ఉన్న డూబైకర్ ప్రాతం నుంచి వచ్చిన నిర్వాసితులను తరలిస్తున్న వాహనం లక్ష్యంగా డ్రోన్​ దాడి చేసినట్టు సూడాన్​కు చెందిన డాక్టర్ల నెట్​వర్క్ పేర్కొంది. ఈ దాడిలో వాహనంలోని చాలా మంది చనిపోయారని తెలిపింది. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్టు చెప్పింది. అయితే కోర్డిఫాన్​ ప్రావిన్స్ అంతటా మెడిసిన్, వైద్య సామాగ్రికి కొరత ఏర్పడిందని తెలిపింది.

డబ్ల్యూఎఫ్​పీ వాహనాలపై డ్రోన్ అటాక్​ 

ఆర్ఎస్ఎఫ్ శుక్రవారం కూడా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్​పీ) సాయం తీసుకెళ్తున్న వాహన కాన్వాయ్‌‌పై డ్రోన్ అటాక్ చేసింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. ట్రక్కులు, వాటిలోని ఆహార, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఎల్ఓబైడ్ నగరానికి ఆహారం, మందులు, ఇతర సహాయ సామాగ్రి తీసుకెళ్తుండగా ఈ దాడి జరిగింది. యుఎన్, అమెరికా ఈ దాడులను ఖండించాయి. సూడాన్‌‌లో 2023 ఏప్రిల్ నుంచి సైన్యం, ఆర్ఎస్ఎఫ్ మధ్య యుద్ధం జరుగుతున్నది. ఇప్పటికే వేలాది మంది చనిపోగా.. కోట్ల మంది నిరాశ్రయులు అయ్యారు. ప్రజలు ఆకలి, రోగాలతో మృత్యువాత పడుతున్నారు.