డ్రోన్ ద్వారా వికలాంగుడికి పెన్షన్ పంపించిన సర్పంచ్

డ్రోన్ ద్వారా వికలాంగుడికి పెన్షన్ పంపించిన సర్పంచ్

మనసుంటే మార్గముంటుందన్న నీతి సూక్తిని ఓ సర్పంచ్ పాటించి చూపించారు. పుట్టుకతోనే వికలాంగుడైన ఓ వ్యక్తికి గ్రామ సర్పంచ్ డ్రోన్ ద్వారా పెన్షన్ డబ్బులు పంపించి, తన దయా హృదయాన్ని చాటుకున్నారు. ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న హెతారం సత్నామీ అనే వికలాంగుడు ప్రభుత్వ పింఛను కోసం ప్రతి నెలా దట్టమైన అడవిలో గుండా 2 కి.మీ. ప్రయాణించాల్సి వచ్చేది. అయితే అతని బాధను అర్థం చేసుకున్న భలేశ్వర్ పంచాయతీ పరిధిలోని భుత్కపాడు గ్రామ సర్పంచ్ సరోజ్ అగర్వాల్... ఆన్ లైన్ లో డ్రోన్ ను కొనుగోలు చేశారు. ఇతర దేశాలలో డ్రోన్‌ల ద్వారా వస్తువులు ఎలా పంపుతున్నారో తెలుసుకొని మరీ..హెతారం ఇంటి వద్దకే పెన్షన్ డబ్బును డెలివరీ చేశారు. అయితే పంచాయితీ దగ్గర అంత మొత్తంలో నిధులు లేనందున, సరోజ్ అగర్వాలే తన సొంత డబ్బుతో డ్రోన్ కొని, డబ్బు పంపించారని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీఓ) సుబదార్ ప్రధాన్ తెలిపారు. మందులు, కిరాణా సామాగ్రి, ఆహారంతో సహా వివిధ వస్తువులను డెలివరీ చేయడంలో డ్రోన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే డ్రోన్ ద్వారా డబ్బును డెలివరీ చేయడం భారతదేశంలోనే ఇది మొదటిసారి కావడం విశేషం.