యువతను నాశనం చేయాలని పాక్-చైనా కుట్ర

యువతను నాశనం చేయాలని పాక్-చైనా కుట్ర

డ్రగ్స్ వివాదంపై పార్లమెంట్‌‌లో ఎంపీ రవి కిషన్

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్ సంబంధిత ఆరోపణలు కీలకమయ్యాయి. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ మాన్‌‌సూన్ సెషన్‌‌లో డ్రగ్స్ విషయాన్ని నటుడు, పార్లమెంటేరియన్ రవి కిషన్ లేవనెత్తారు. దేశ యువతను నాశనం చేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్, చైనాలు డ్రగ్స్ కుట్రను పన్నాయని మండిపడ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా డ్రగ్ వాడకం ఉందని, నేరస్థులను పట్టుకొని తగిన రీతిలో శిక్షించాలన్నారు.

‘దేశ యువతను నాశనం చేయాలని కుట్ర జరుగుతోంది. దీనికి మన పొరుగు దేశాలు సహకారం అందిస్తున్నాయి. ప్రతి ఏడాది పాకిస్తాన్, చైనా నుంచి మన దేశానికి డ్రగ్స్ స్మగ్లింగ్ అవుతోంది. పంజాబ్, నేపాల్‌‌ల మీదుగా డ్రగ్స్‌‌ను తీసుకొస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా డ్రగ్ అడిక్షన్ ఉంది. ఇండస్ట్రీకి చెందిన వారు కొందరు పట్టుబడ్డారు కూడా. ఎన్సీబీ చాలా బాగా పని చేస్తోంది. నేరస్థుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నా. వాళ్లకు తగిన శిక్ష పడాలి. పొరుగు దేశాలు పన్నిన ఈ కుట్రకు ముగింపు పలకాలి’ అని రవి కిషన్ పేర్కొన్నారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన హిట్ ఫిల్మ్ రేసుగుర్రంలో రవి కిషన విలన్ పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. భోజ్‌పురి సూపర్ స్టార్ అయిన రవి కిషన్.. పలు హిందీ సినిమాల్లో కూడా నటించారు.