హైదరాబాద్: దగ్గు వచ్చినప్పుడు వాడే గ్లైకోరిల్ కాఫ్ సిరప్ను వాడొద్దని డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు సూచించారు. అనుమతులకు విరుద్ధంగా దగ్గు మందును తయారు చేస్తున్న కంపెనీ పైన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. కూకట్పల్లిలోని ప్రశాంత్ నగర్లో దగ్గు మందును తయారు చేస్తున్న అఖిల్ లైఫ్ సైన్సెస్ కార్యాలయంలో 65 వేల రూపాయల విలువ చేసే స్టాక్ను అధికారులు సీజ్ చేశారు. తయారీలో ఎటువంటి నిబంధనలను పాటించడం లేదని, ఈ దగ్గు మందు వాడటం వల్ల ప్రమాదం పొంచి ఉందని అధికారులు తేల్చారు. ఇలాంటి దగ్గు మందులు ఎక్కడ కనిపించినా తమకు తెలియజేయాలని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సూచించారు. ఇండియాలో తయారు చేసిన కాఫ్ సిరప్ లు 141 మంది ప్రాణాలను బలి తీసుకున్న సంగతి తెలిసిందే.
గత కొన్ని సంవత్సరాలుగా 100కు పైగా కంపెనీలు చిన్న పిల్లల దగ్గుమందు టానిక్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నాయి. ఇండియాలో 100కు పైగా ఫార్మా కంపెనీలు దగ్గు మందు పేరుతో తయారుచేస్తున్న ఔషధాలు ప్రమాదకరం అని తేలిన విషయం విదితమే. గాంబియా, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో పదుల సంఖ్యలో పిల్లల మరణాలకు ఆ దగ్గు మందులే కారణమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) 2022లోనే తేల్చి చెప్పింది. అప్పటి నుంచి భారత్ లో తయారవుతున్న దగ్గు మందులపై కేంద్ర ప్రభుత్వం, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నిఘా పెట్టింది. అయినప్పటికీ కొన్ని కంపెనీలు గుట్టు చప్పుడు కాకుండా నిబంధనలను గాలికొదిలేసి దగ్గు మందు పేరుతో ప్రమాదకరమైన ఔషధాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.