పెళ్లి కంటే ఘనంగా విడాకుల సంబురం: బ్యాండ్ మేళం.. ఊరేగింపు.. స్వీట్లతో కూతురికి స్వాగతం

పెళ్లి కంటే ఘనంగా విడాకుల సంబురం: బ్యాండ్ మేళం.. ఊరేగింపు.. స్వీట్లతో కూతురికి స్వాగతం

పెళ్లంటే నూరేళ్ల పంట అనేది సామెత.. పెళ్లి తర్వాత విడాకులు అనేవి వందేళ్ల స్వేచ్ఛ అంటున్నారు నేటి యువతీ యువకులు. విడాకులు అనగానే అమ్మో అనే రోజుల నుంచి విడాకులు వచ్చేశాయ్ అంటూ సంబరాలు చేసుకునే కాలానికి వచ్చేశాం. కూతురికి విడాకులు అయితే బాధపడే తల్లిదండ్రులు నాటి కాలం నుంచి.. కూతురికి విడాకుల వస్తే పెళ్లి కంటే ఘనంగా వేడుకలు చేసే పేరంట్స్ ఇప్పుడు కనిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‎లో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేయటమే కాదు.. ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ విడాకుల సంబరానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‎లోని మీరట్‎కు చెందిన జ్ఞానేంద్ర శర్మకు ఒక్కాగానొక్క కూతురు ప్రణిత. ఒకే కూతురు కావడంతో తండ్రికి బిడ్డ అంటే ఎనలేని ప్రేమ. చిన్నప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా అల్లారుముద్దుగా పెంచాడు. ప్రణిత పెద్దాయక 2018లో ఆమెను ఆర్మీలో పని చేస్తోన్న గౌరవ్ అగ్నిహోత్రికి ఇచ్చి పెండ్లి చేశాడు. వీరికి ఒక కుమారుడు కూడా పుట్టాడు. మూడేండ్లు బానే సాగిన ప్రణిత, గౌరవ్ సంసారంలో విభేదాలు వచ్చాయి.

ప్రణిత తన అత్తమామల నుంచి తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంది. రోజురోజుకు పరిస్థితి మరింత దిగజారడంతో ఇక ఒపిక పట్టలేక భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా 2021లో మీరట్ కోర్టులో విడాకులకు అప్లై చేసుకుంది ప్రణీత. ఐదేండ్ల విచారణ అనంతరం మీరట్ కోర్టు ప్రణీతకు 2026, ఏప్రిల్‎లో విడాకులు మంజారు చేసింది. సాధారంగా కూతురు విడాకులు తీసుకుంటే ఎవరైనా తల్లిదండ్రులు బాధ పడతారు. 

కానీ ప్రణీత తల్లిదండ్రులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహారించారు. కొంచెం కూడా బాధ పడకుండా కూతురికి విడాకులు మంజూరు కావడాన్ని పెళ్లి కంటే ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రణీతకు విడాకులు మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వు వెలువడిన వెంటనే ఆమె తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు డప్పులు, పూలమాలలు, స్వీట్లు సిద్ధం చేసి మీరట్ జిల్లా కోర్టు బయట సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు.

 బంధువులు డప్పుచప్పుళ్లకు డ్యాన్స్ చేస్తూ లడ్డూలు పంచుకున్నారు. కూతురు విడాకులు తీసుకుని భర్తతో విడిపోతే బాధపడాల్సింది పోయి బ్యాండ్ మేళంతో ఊరేగింపు,  స్వీట్ల పంచుకుంటూ తండ్రికి ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. 

కూతురి విడాకులపై ఆమె తండ్రి డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ మాట్లాడుతూ.. నా కుమార్తె పుట్టినప్పుడు డప్పులు వాయించి వేడుకలు చేసుకున్నాం. ఇప్పుడు ఆమె విడాకులు తీసుకున్నా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కుమార్తె విలువ ఆమె జీవితంలో ఎప్పుడూ మారదని నిరూపించడానికే ఇలా డప్పులు వాయించి వేడుక చేసుకున్నామని తెలిపారు.