కాక్రోచ్ జనతా పార్టీ ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో చేసిన ప్రచారంలో భాగంగా గవర్నమెంట్ స్కూల్ గురించి వీడియో చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గౌరవ్ భారతికి ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 2.5 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో దాదాపు 1.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న.. 22 ఏళ్ల విద్యార్థి, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గౌరవ్ భారతి సొంతూరు ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలోని కరణ్‌పూర్ మజ్రా బన్స్‌మేయి గ్రామం. ‘స్కూల్ ఠీక్ కరో’కు మద్దతు తెలపాలని భావించిన గౌరవ్ భారతి తన సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలలోని పరిస్థితులనే చూపించాలనుకున్నాడు.
🚨 In UP, filming a crumbling govt school can land you in jail.
— Rajat Jain (@RajatJain) September 18, 2026
Gaurav Bharti shot a video of a waterlogged, dilapidated primary school in Farrukhabad — kids couldn't sit, had no classes. He posted it online.
UP Police's response? An FIR under BNS & the IT Act.
He's now moved… pic.twitter.com/2y5kKUkUxR
ఆగస్ట్ 16న ఆదివారం కావడంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆ రోజు కరణ్‌పూర్ మజ్రా బన్స్‌మేయిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గౌరవ్ సందర్శించి, అక్కడి మౌలిక సదుపాయాలలోని లోపాలను వివరిస్తూ ఒక వీడియోను రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తరగతి గదుల దగ్గర నీళ్లు నిలిచిపోవడం, గది పైకప్పు శిథిలావస్థలో ఉండటం, కూలిన ప్రహరీ గోడ చుట్టూ దట్టంగా పెరిగిన మొక్కలు, నీటి నిల్వ ట్యాంకులో నీరు లేకపోవడం.. ఇలా పాఠశాల స్థితిగతులను గౌరవ్ తన వీడియోలో వివరించాడు. ఈ పరిస్థితులను మార్చాలని కోరుతూ గ్రామ ప్రధాన్‌కు ఒక దరఖాస్తు రాస్తానని కూడా ఈ వీడియోలో చెప్పాడు.
మరుసటి రోజు, ఆగస్టు 17న.. గౌరవ్ భారతి మరోసారి పాఠశాలకు వెళ్లాడు. ఉపాధ్యాయులతో మాట్లాడాడు. కానీ.. గౌరవ్ భారతిపై అదే పాఠశాలలో పనిచేసే టీచర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 19న.. ఫరూఖాబాద్ పోలీసులు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పాఠశాలలో పరిస్థితిని వక్రీకరించి, తప్పుదోవ పట్టించే విధంగా చూపించారని ఆమె అతనిపై ఆరోపించారు. పాఠశాల మైదానంలో నిరుపయోగంగా ఉన్న భవనం శిథిలావస్థలో ఉంటే.. ఆ భవనాన్ని చూపించి తప్పుదోవ పట్టించాడని టీచర్ ఫిర్యాదులో పేర్కొంది.
