తాగిన మత్తులో పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు

తాగిన మత్తులో పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు

వరంగల్‍, వెలుగు: మద్యంమత్తులో నేరాలు పెరిగిపోతున్నాయి. వాడవాడలా వెలిసిన బెల్టుషాపుల్లో రాత్రి, పగలు తేడా లేకుండా 24 గంటల పాటు లిక్కర్​ దొరుకుతుండడంతో పెద్దసంఖ్యలో జనం మద్యానికి బానిసలవుతున్నారు. తాగిన మైకంలో కొందరు చిన్నచిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటుండగా, ఇంకొందరు విచక్షణ కోల్పోయి హత్యలదాకా వెళ్తున్నారు. తల్లిదండ్రులను, తోడబుట్టినవాళ్లను, కట్టుకున్నవాళ్లను, కలిసి తిరిగిన దోస్తులను కూడా హతమారుస్తున్నారు. మద్యం మత్తులోనే రేప్​లు, ముఖ్యంగా పసిపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. 80 శాతం నేరాలకు మద్యమే కారణమని పోలీసులు చెప్తుండగా, గడిచిన నెల వ్యవధిలో రాష్ట్రంలో 100కు పైగా ఆత్మహత్యలు, హత్యలు కేవలం మద్యం మత్తులో జరగడం కలకలం రేపుతున్నది.

నాలుగు రెట్లు పెరిగిన లిక్కర్​ సేల్స్​.. 

 తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో 2014---–15లో రాష్ట్రంలో లిక్కర్​ ఆదాయం రూ. 10వేల కోట్లు ఉండగా, గతేడాది  రూ.30వేల  కోట్లు వచ్చింది. ఈ ఏడాది లిక్కర్​ సేల్స్​ ద్వారా ఏకంగా రూ.40 వేల కోట్లు రాబట్టాలని సర్కారు టార్గెట్​గా పెట్టుకున్నది. ఈస్థాయిలో ఇన్​కం రావాలంటే కనీసం 45వేల కోట్ల విలువైన సేల్స్​ జరగాలి. అంటే ప్రతి నెలా రూ.3,750 కోట్ల విలువైన మద్యం అమ్మాలని ఎక్సైజ్​శాఖకు టార్గెట్​ పెట్టింది. దీంతో ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని భావిస్తున్న ఆబ్కారీ ఆఫీసర్లు విచ్చలవిడిగా  అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. వాడవాడలా బెల్టుషాపులు తెరుస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. జనాన్ని బాగా తాగిస్తూ సర్కారు గల్లా పెట్టె నింపుతున్నారు. వెయ్యి జనాభా ఉన్న గ్రామంలో కనీసం 10 బెల్టుషాపులు ఉంటున్నాయి. ఇక్కడ 24 గంటల పాటు లిక్కర్ ​దొరుకుతోంది. చాలా బెల్టుషాపుల్లో ఉద్దెరకు మద్యం ఇస్తుండడంతో చాలా మంది తాగుడుకు బానిసవుతున్నారు. 

 మద్యం మత్తులో క్రైమ్స్​.. 

మద్యం మత్తులో 80శాతం నేరాలు జరుగుతున్నట్లు పోలీస్ ​రికార్డులు చెప్తున్నాయి. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్​ కరీంనగర్​లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఇదే విషయాన్ని గుర్తుచేశారు. దిశ రేప్​ అండ్​ మర్డర్​ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన ‘డిపార్ట్​మెంట్​ ఆఫ్​ మెంటల్​ హెల్త్’​, ‘ఆదిలాబాద్ రిమ్స్’ ఆధ్వర్యంలో  చంచల్​గూడ జైలులో ఉన్న 65 మంది నేరస్తుల మీద స్టడీ చేశారు. ఇతర ఎలాంటి మానసిక సమస్యలు లేకున్నా కేవలం లిక్కర్​ప్రభావంతో నేరాలకు పాల్పడినట్టు  గుర్తించారు. మద్యం మత్తులో నేరాలకు పాల్పడిన వారిలో 43 శాతం మంది 26 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్నవారేనని, వీరిలోనూ 55 శాతం మంది తక్కువ ఆదాయ, సామాజిక స్థాయి గలవారని స్టడీ తేల్చింది. ఈ వర్గాలకు చెందిన వారిలో మద్యం అలవాటును మాన్పించడంవల్ల క్రైమ్​రేటును గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది. కానీ ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే ఏటా మద్యం మత్తులో ఆత్మహత్యలు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. గతేడాది రాష్ట్రంలో ఏకంగా 1,027 మర్డర్లు జరిగితే 2,126 రేప్​లు జరగడం గమనార్హం.


మత్తులో లేకుంటే.. మర్డర్‍ చేయలేరు

ప్రస్తుతం జరుగుతున్న క్రైంలో 90 శాతానికి పైగా  మత్తులో చేస్తున్నవే. మత్తులో లేకుంటే మర్డర్‍, రేప్​, ఘర్షణ పడాలనే ఆలోచన దాదాపు ఎవ్వరికీ రాదు. మత్తులో ఉన్నప్పుడు మైండ్‍ మాట వినదు. నేరం చేయాలనే ఆలోచనను మరింత పెంచుతుంది. దురదుష్టవశాత్తు రాష్ట్రంలో అడుగుకో వైన్‍, బార్‍, బెల్ట్ షాపులతో లిక్కర్‍ ఇప్పుడు పెద్దొళ్లకే కాకుండా చిన్న పిల్లలు, మహిళలకు కూడా అందుబాటులో ఉంటోంది. దీంతో అదేస్థాయిలో మర్డర్లు, రేప్‍, యాక్సిడెంట్‍ కేసులు పెరుగుతున్నాయి. 
- తౌటం రాము (నిర్వాహకులు, హెల్పింగ్‍ హ్యాండ్‍ అల్కహల్‍ డీ అడిక్షన్‍ సెంటర్‍ )