V6 News

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

జీడిమెట్ల: తాగిన మత్తులో ఓ వ్యక్తి కారు నడిపి మూడు కరెంట్ స్తంభాలు, 2 కార్లను ఢీకొట్టాడు. ఈ ఘటన పేట్​బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. బోయిన్ పల్లికి చెందిన రవికిరణ్ గురువారం రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి మద్యం తాగాడు. తర్వాత ఇన్నోవా వెహికల్​లో బంధువుల ఫంక్షన్​కు బయలుదేరాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు కుత్బుల్లాపూర్​లోని ఓ కార్ల షోరూం దగ్గరికి రాగానే తాగిన మత్తులో  మూడు కరెంట్ స్తంభాలను ఢీకొట్టాడు. తర్వాత షోరూం దగ్గరున్న రెండు కార్లు, గేటును ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్తంభాలు విరిగిపోగా.. ఆ ఏరియాలో దాదాపు 12 గంటల పాటు కరెంట్ సప్లయ్​కు అంతరాయం ఏర్పడింది. కార్ల షోరూమ్ దగ్గర ఉన్న వాచ్​మన్.. రవికిరణ్​​ను ఆపేందుకు ప్రయత్నించాడు. అతడు వాచ్ మన్ పై దాడి చేసి కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాలేజీ బస్సు ఢీకొని ఒకరి మృతి

గచ్చిబౌలి, వెలుగు: కాలేజీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి చనిపోయిన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో జరిగింది. బీరంగూడలోని ఇక్రిశాట్ కాలనీ ఫేజ్–2లో ఉండే శ్రీహర్ష(37) గచ్చిబౌలి
లోని ఇండియన్ ఇమ్యూనాలాజికల్ లిమిటెడ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బైక్​పై ఆఫీసుకు బయలుదేరాడు. హెచ్​సీయూ బస్ డిపో దగ్గరున్న సిగ్నల్​ను దాటి ముందుకెళ్లగా.. అదే టైమ్​లో వెనుకాల నుంచి ఓవర్ స్పీడ్​తో వచ్చిన జేబీఐటీ కాలేజీ బస్సు అతడి బైక్​ను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రీహర్షను స్థానికులు దగ్గరలోని హాస్పిటల్​కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బుద్వేల్​లో మరొకరు..

గండిపేట:  బల్దియా వెహికల్​ను బైక్ తో ఢీకొని ఓ యువకుడు చనిపోయిన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోజరిగింది. బుద్వేల్ రైల్వే స్టేషన్ ఏరియాలోఉండే అరుణ్ కుమార్(26)ఓ మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు బైక్ పై అత్తాపూర్ మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నం.179 వద్ద రోడ్లను క్లీన్ చేసే బల్దియా శానిటేషన్ వెహికల్​ను అరుణ్ కుమార్ బైక్​తో ఢీకొట్టాడు. ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు దగ్గరలోని హాస్పిటల్​కు తరలించారు. అప్పటికే అరుణ్ కుమార్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

న్యూసెన్స్ కేసులో 17 మందికి జైలు

10 రోజుల శిక్ష విధించిన కోర్టు

ముషీరాబాద్, వెలుగు: న్యూసెన్స్ కేసులో 17 మంది ఆకతాయిలకు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. ముషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి వైఎస్సార్ పార్క్, పార్సిగుట్ట చౌరస్తా సెట్విన్ గ్రౌండ్, భోలక్​పూర్, కత్నికాంటా, ఇతర  ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు పబ్లిక్ ప్లేసుల్లో మద్యం తాగుతూ  స్థానికులను ఇబ్బందులను గురిచేస్తున్నారు. దీని గురించి సమాచారం అందుకున్న ఇన్ స్పెక్టర్ జహంగీర్ యాదవ్ సిబ్బందితో కలిసి ఆ ఏరియాల్లో దాడులు చేసి 17 మందిని అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

సైబర్‌‌ నేరాలను అరికట్టడంలో సర్కార్ ఫెయిల్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సైబర్‌‌ ‌‌నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని నేష‌‌న‌‌ల్ స్టూడెంట్స్ యూనియ‌‌న్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌‌యూఐ) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌‌ ఆరోపించారు. ఈ సమస్యను ఐటీ శాఖ మంత్రి‌‌ కేటీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సైబర్‌‌ ‌‌నేరాలపై సిటీ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌‌కు ఆయన శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..సైబర్‌‌‌‌ నేరాలు రోజు రోజుకు పెరిగుతున్నాయని బల్మూరి వెంకట్‌‌ వెల్లడించారు. మహిళలు సెల్‌‌ఫోన్లతో ఫొటోలు తీసుకోవడానికి కూడా భయపడుతున్నారని తెలిపారు. ప్రతి విషయంపై ట్విట్టర్‌‌ ద్వారా స్పందించే కేటీఆర్ సైబర్‌‌‌‌ నేరాలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయించే బదులు అదే సిబ్బందిని సైబర్‌‌‌‌నేరాల నియంత్రణకు ఉపయోగించాలని అన్నారు. సైబర్‌‌ నేరాలపై సీఎం ఎందుకు సమీక్షలు చేయడం లేదని నిలదీశారు. ఘట్‌‌కేసర్‌‌‌‌ వీబీఐటీ విద్యార్థినుల ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బల్మూరి డిమాండ్‌‌ చేశారు.

సివిల్‌‌ సప్లయ్స్‌‌ గోదాముల్లో సోలార్‌‌ ప్యానెల్స్‌‌ : రవీందర్ సింగ్

హైదరాబాద్, వెలుగు : గ్రీన్ ఎనర్జీని  ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సివిల్‌‌ సప్లయ్స్‌‌ గోదాముల్లో సోలార్ పవర్‌‌ సిస్టమ్స్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ చైర్మన్  సర్దార్ రవీందర్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం సివిల్‌‌ సప్లయ్స్‌‌ భవన్‌‌లోని తన ఆఫీసులో రెడ్కో వీసీఎండీ  జానయ్య,  సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గౌడ్​తో ఆయన సమావేశమయ్యారు. సివిల్‌‌ సప్లయ్స్‌‌ సంస్థ కరెంటు బిల్లులను తగ్గించుకోవడానికి సోలార్ పవర్‌‌ వినియోగమే సరైన మార్గమని రవీందర్​ సింగ్​ అన్నారు. తొలి దశలో 26 గోదాముల్లో సోలార్ పవర్‌‌ ప్యానెల్స్‌‌  ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పెట్రోలు బంకులు, ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు  అనువైన గోదాములను గుర్తించాలని అధికారులకు సూచించారు.  రెడ్కో సహకారంతో ముందుకు వెళ్లాలన్నారు.  అనంతరం  జిల్లా సివిల్‌‌ సప్లయ్స్‌‌ ఆఫీసును ఆయన సందర్శించారు.

షూస్​లో బంగారం దాచిండు

ఎయిర్​పోర్టులో ప్యాసింజర్ అరెస్ట్
480 గ్రాముల గోల్డ్ సీజ్

శంషాబాద్, వెలుగు: షూస్ లో బంగారాన్ని దాచి తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షేక్ అత్తార్ సమీర్ ఆల్తార్ అనే వ్యక్తి శుక్రవారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. షూస్​లో బంగారాన్ని దాచి తీసుకెళ్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 480 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 26 లక్షల 78 వేల 400 ఉంటుందని అంచనా వేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.