V6 News

ఒపెక్ కూటమికి యూఏఈ గుడ్‌‌‌‌బై.. మే 1 నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటన

ఒపెక్ కూటమికి యూఏఈ గుడ్‌‌‌‌బై.. మే 1 నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటన
  • యూఏఈ నిర్ణయంతో మారనున్న గ్లోబల్ మార్కెట్ ముఖచిత్రం
  • ధరల నియంత్రణలో తగ్గనున్న సౌదీ  ఆధిపత్యం
  • మార్కెట్లోకి చమురు సరఫరా పెరిగి రేట్లు తగ్గే అవకాశం
  • ఫలితంగా చమురు వినియోగ దేశాలకు దీర్ఘకాలిక ప్రయోజనం

అబుదాబి: పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్), ఒపెక్+ గ్రూపుల నుంచి తాము మే 1 నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మంగళవారం ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధంతో ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఒపెక్​లోని కీలక దేశం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 

యూఏఈ ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా వ్యూహాత్మక చర్యలు తీసుకున్నట్టు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ‘వామ్’ వెల్లడించింది. ఒపెక్, ఒపెక్+ గ్రూపుల నుంచి వెళ్లినా యూఏఈ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, మార్కెట్ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా అదనపు ఇంధనాన్ని మార్కెట్లోకి తెస్తుందని తెలిపింది. కాగా, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబెల్స్  ఉన్న యెమెన్​పై, పలు ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలపై యూఏఈ, సౌదీ మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడినట్టు తెలుస్తోంది.

ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం!
చమురు సరఫరాను నియంత్రించి, ధరలను ప్రభావితం చేయడానికి1960లో సౌదీ, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలు కలిసి ఒపెక్ కూటమిని ఏర్పాటు చేశాయి. ఇందులోకి యూఏఈ 1967లో చేరింది. ఇక ఒపెక్+ లో ఒపెక్ సభ్య దేశాలతో పాటు రష్యా వంటి ఇతర ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు యూఏఈ ఒపెక్ నుంచి వైదొలగడం చమురు మార్కెట్‌లో పెను మార్పులకు నాంది కానుంది. ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా చమురు ధరలను నియంత్రిస్తున్న సౌదీ అరేబియా ఆధిపత్యం బలహీనపడటమే కాకుండా కూటమి ఐక్యత దెబ్బతింటుంది.

రోజుకు సుమారు 4.8 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యూఏఈ.. ఇకపై ఒపెక్ కోటాలతో సంబంధంలేకుండా స్వతంత్రంగా ఉత్పత్తిని పెంచుకోవచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో మార్కెట్లోకి చమురు సరఫరా పెరిగి ధరలు తగ్గవచ్చు. కానీ ప్రస్తుతం ఇరాన్ యుద్ధం, హార్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరాలో తీవ్ర అస్థిరత ఏర్పడి ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

యూఏఈ తన జాతీయ ప్రయోజనాల కోసం 2027 నాటికి ఉత్పత్తిని 5 మిలియన్ బ్యారెళ్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిష్క్రమణ ఒపెక్ ప్రభావం తగ్గడానికి సూచికగా నిలుస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో చమురు ధరల నిర్ణయం కేవలం ఒక కూటమి చేతుల్లో ఉండకుండా మరింత పోటీతత్వంతో కూడిన స్వేచ్ఛా మార్కెట్ వైపు మళ్లే అవకాశం ఉంది.