న్యూఢిల్లీ: పెట్రోల్ డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదనేమీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా రేట్లు పెరగవని జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వివరించారు. ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయనే ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ రూ.94.77 కాగా, హైదరాబాద్లో రూ.107 పలుకుతోంది.
గత నాలుగేళ్లుగా రిటైల్ ధరల్లో మార్పు రాలేదని, ముడి చమురు ధరలు దాదాపు 50 శాతం పెరిగినా వినియోగదారులపై భారం వేయడం లేదని చెప్పారు. ధరలు పెరుగుతాయనే భయంతో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రజలు ఇంధనం కోసం క్యూ కట్టడం వల్ల కొన్ని చోట్ల కొరత ఏర్పడిందని అన్నారు. దేశంలో తగినంత నిల్వలు ఉన్నాయని ప్రజలు పుకార్లు నమ్మకుండా, అధికారిక సమాచారం నుంచి విషయాలు తెలుసుకోవాలని కోరారు. చమురు కంపెనీలు నష్టపోతున్నప్పటికీ సామాన్యుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుజాత వెల్లడించారు.

