
- అక్టోబర్ మొదటివారం నుంచే ధాన్యం కొనుగోళ్లు
- సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ వెల్లడి
- ఈసారి 75 లక్షల టన్నుల కొనుగోళ్లు టార్గెట్
- వడ్లు తడవకుండా సెంటర్ల వారీగా వెదర్ ఫోర్‌కాస్ట్
- బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన మిల్లులకే ధాన్యం ఇస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే తొలిసారిగా ధాన్యం సేకరణ ప్రక్రియలో ఆటోమేటిక్ ప్యాడీ డ్రయర్స్, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్‌ను ప్రవేశపెడుతున్నట్టు సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. 2025–26 వానాకాలం సీజన్‌లో ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా సన్నద్ధమైందని తెలిపారు. అకాల వర్షాల నుంచి రైతుల ధాన్యాన్ని కాపాడేందుకు వెదర్ ఫోర్‌కాస్ట్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మంగళవారం సివిల్ సప్లైస్ భవన్‌లో డైరెక్టర్ హనుమంతు గెండగీ, అసిస్టెంట్ డైరెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి చౌహాన్ మీడియాతో మాట్లాడారు.
ఆటోమేటిక్ డ్రయర్స్ ధాన్యంలోని అధిక తేమ శాతాన్ని తగ్గించి, ధాన్యం నాణ్యతను మెరుగుపరుస్తాయని, పంట నష్టాన్ని నివారిస్తాయని వివరించారు. అలాగే, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ వాక్యూమ్ సక్షన్ ద్వారా ధాన్యాన్ని శుభ్రపరిచి, తేమ శాతాన్ని 2% వరకు తగ్గించి, కూలీల అవసరాన్ని తగ్గిస్తాయని తెలిపారు. 977 ప్యాడీ క్లీనర్లతోపాటు మరో 2,649 అదనంగా అవసరాలను గుర్తించామని తెలిపారు
75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్..
ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 65.96 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగిందని, 159.15 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని డీఎస్ చౌహాన్ తెలిపారు. ‘‘ఇందులో సివిల్ సప్లయ్స్ ద్వారా ప్రభుత్వం 75 లక్షల టన్నులను సేకరించనున్నది. ఇలా సేకరించిన ధాన్యంలో 53 లక్షల టన్నులు ఎఫ్ సీఐ ద్వారా మద్దతు ధర రూ.2,389, రూ.2,369 చొప్పున కొనుగోళ్లకు కేంద్రం అనుమతించింది” అని తెలిపారు. రూ.500 బోనస్‌ఇచ్చి సన్నధాన్యం సేకరిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్‌లో ముందస్తుగా ధాన్యం వచ్చే నిజామాబాద్ జిల్లాలో మొదటివారంలో సెంటర్లు తెరుస్తామని తెలిపారు.
అక్టోబర్ సెకండ్ వీక్‌లో మెదక్, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్ జిల్లాల్లో, మూడో వారంలో సిద్దిపేట, కరీంనగర్, జనగాం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. నాలుగోవారంలో మంచిర్యాల, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో, అక్టోబర్ చివరి వారంలో నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సెంటర్లను తెరుస్తామని చెప్పారు. ఆ తర్వాత నవంబర్‌లో మిగతా జిల్లాల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలలో అత్యధికంగా 6.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లాలో 5 లక్షల టన్నులు, నల్గొండ జిల్లాలో 4.76 లక్షల టన్నులు కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
8,332 కొనుగోలు సెంటర్లలో ప్రత్యేక పరికరాలు..
ధాన్యం సేకరణ సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,332 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని డీఎస్ చౌహన్ తెలిపారు. ఇందులో 4,252 ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్), 3,522 ఐకేపీ సెంటర్లు..కాగా మరో 558 ఇతర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి సేకరణ కేంద్రంలో టార్పాలిన్లు, ఆటోమేటిక్ డ్రయర్స్, క్లీనర్స్, గ్రెయిన్ కాలిపర్స్, తేమ మీటర్లు, ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు, తాలు తొలగింపు యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ధాన్యం సేకరణలో కీలకమైన 18.75 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని గుర్తించినట్లు చెప్పారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా రూ.29 చొప్పున హమాలీ చార్జీలు ఇస్తున్నామని తెలిపారు.
వచ్చే నెలలో సంచుల్లో రేషన్ సన్న బియ్యం
రాష్ట్రంలో రేషన్ కార్డులు కోటి దాటాయని డీఎస్ చౌహాన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ఒక లక్షా 63 వేల 791 రేషన్ కార్డులు ఉన్నాయని, ఇందులో 3 కోట్ల 26 లక్షల 31 వేల 132 మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. వచ్చే నెల ప్రత్యేకంగా సంచిలో రేషన్ సన్న బియ్యం అందించనున్నట్లు చెప్పారు. రేషన్‌లో బియ్యంతోపాటు ఇతర సరుకులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని వెల్లడించారు.
బ్యాంక్గ్యారెంటీ ఇచ్చిన మిల్లులకే..
బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయింపులు చేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. కొనుగోలు సెంటర్లలోనే ట్రక్ షీట్ ఇస్తామని, మిల్లుల్లో దించుకున్న ధాన్యానికి, రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. గతంలో అడ్డగోలుగా మిల్లలుకు ధాన్యం కేటాయింపులతో సమస్య ఉండేదని, ఇప్పుడు ప్యాడీ అలోకేషన్ పారదర్శకంగా ఉంటుందని వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వడ్లు రాకుండా 17 జిల్లాల్లో 56 ఇంటర్-స్టేట్ బోర్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
సీసీ కెమెరాలతో గట్టి నిఘా పెట్టినట్టు తెలిపారు. 2022–23 యాసంగికి సంబంధించి 35 లక్షల టన్నుల ధాన్యం వేలం వేసిన నేపథ్యంలో.. బిడ్డర్ల నుంచి రావాల్సిన రూ.6,996 కోట్లలో ఇప్పటి వరకూ రూ.4,500 కోట్ల వరకు వచ్చాయని తెలిపారు. మిగతా రూ.2 వేల కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. దీనిపై కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.