MLC 2025: ఇతనికి వయసు నెంబర్ మాత్రమే: 40 ఏళ్ళ వయసులో సెంచరీ.. బట్లర్, రోహిత్ సరసన ఫాఫ్

MLC 2025: ఇతనికి వయసు నెంబర్ మాత్రమే: 40 ఏళ్ళ వయసులో సెంచరీ.. బట్లర్, రోహిత్ సరసన ఫాఫ్

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వయసుతో సంబంధం లేకుండా టీ20 ఫార్మాట్ లో తన తడాఖా చూపిస్తున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా 40 ఏళ్ళ వయసులో విధ్వంసకర ఇన్నింగ్స్ లతో రెచ్చిపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ జట్టును ముందుండి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఫాఫ్ డు ప్లెసిస్ ఈ సీజన్ లో రెండో సెంచరీ నమోదు చేశాడు. సోమవారం (జూన్ 29) డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో ఎంఐ న్యూయార్క్ పై 53 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని స్టార్ ఆటగాళ్లు బట్లర్, రోహిత్ సరసన చేరాడు. 

ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఫాఫ్.. ఈ మ్యాచ్ లో 53 బంతుల్లో 103* పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ20 క్రికెట్ లో డుప్లెసిస్ కు ఇది ఎనిమిదో సెంచరీ. ఈ సెంచరీతో డుప్లెసిస్ టీ20 హిస్టరీలో అత్యధిక (8) సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. మైఖేల్ క్లింగర్, ఆరోన్ ఫించ్ , జోస్ బట్లర్ , రోహిత్ శర్మ , డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్ తో సంయుక్తంగా డుప్లెసిస్ 8 సెంచరీలతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్ గా 22 సెంచరీలతో గేల్ టీ20 క్రికెట్ లో అగ్ర స్థానంలో ఉన్నాడు. 11 సెంచరీలతో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ రెండో స్థానంలో ఉన్నాడు. 

విరాట్ కోహ్లీతో పాటు సఫారీ ఆటగాడు రిలీ రుస్సో 9 సెంచరీలతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. మేజర్ లీగ్ క్రికెట్ లో డుప్లెసిడ్  మూడు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా డుప్లెసి నిలిచాడు. ఈ సీజన్ లో రెండు సెంచరీలు బాదిన ఫాఫ్.. 2024 సీజన్ లో ఒక శతకం కొట్టాడు. డుప్లెసిస్ సెంచరీతో (103) మొదట బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో ఎంఐ న్యూయార్క్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 184 పరుగులకు పరిమితమైంది. పొలార్డ్ (70) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.