పెళ్లి.. ఈ మాట వింటే చాలు.. దెయ్యాన్ని చూసినంత భయపడుతున్నారు ఈ తరం జనరేషన్.. వచ్చే పెళ్లాం కంటే.. బయట ఉన్న పరిస్థితులు అలాంటివి.. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితులకు.. పెళ్లి.. పెళ్లాం.. పిల్లలు అంటే జీవితం సర్వనాశనమే అనే భయం ఈ తరం కుర్రోళ్లల్లో బలంగా ఉంది. ఒక వేళ పెళ్లి చేసుకున్నా.. జీవితం సక్కాగా ఉంటుందా అంటే అదీ కష్టమే అనే దుస్థితి.. ఈ కాలంలో జరుగుతున్న పరిణామాలతో క్లారిటీకి వచ్చేశారు. ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.. దీన్ని గట్టిగా పసిగట్టిన దుబాయ్ వ్యాపారవేత్త.. తన కంపెనీలో పెళ్లి చేసుకుండా ఉన్న ఉద్యోగులకు మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చాడు.. పెళ్లి చేసుకోండి.. లక్షలు పట్టుకెళ్లండి.. ఆ తర్వాత పిల్లల్ని కనండి.. మళ్లీ లక్షలు పట్టుకెళ్లండి అంటూ ఉద్యోగులకు ఇచ్చిన ఈ బంపరాఫర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఆ షేక్ ఇచ్చిన షేకింగ్ ఆఫర్ ఏంటో తెలుసుకుందామా..
దుబాయ్‌కి చెందిన ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త, అల్ హబ్దూర్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ ఖలాఫ్ అల్ హబ్దూర్ తన ఉద్యోగుల కోసం ప్రకటించిన ఒక ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తమ కంపెనీలో పనిచేసే యూఏఈ జాతీయులు వివాహం చేసుకుంటే.. వారికి 50వేల దిర్హామ్‌లు అంటే మన కరెన్సీలో సుమారు 12.5 లక్షల రూపాయలు క్యాష్ రివార్డ్ గ్రాంట్‌గా అందజేయనున్నట్లు ప్రకటించారు. కేవలం పెళ్లికే పరిమితం కాకుండా.. వివాహమైన రెండేళ్లలోపు సంతానం కలిగితే ఈ ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తానని మాటిచ్చారు. అంటే పిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబానికి మరింత భారీగా నగదు అందుతుందన్నమాట.
దేశ నిర్మాణం, పురోభివృద్ధిలో పటిష్టమైన కుటుంబ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని నమ్మే ఖలాఫ్ అల్ హబ్దూర్.. ఈ నిర్ణయం కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదని, ఇది ఒక జాతీయ బాధ్యత అని అభిప్రాయపడ్డారు. యువత పెళ్లి చేసుకుని ఫ్యామిలీలను ప్రారంభించేలా ప్రోత్సహించడం ద్వారా దేశ భవిష్యత్తును సురక్షితం చేయవచ్చని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తున్నప్పటికీ.. ప్రైవేట్ సంస్థలు కూడా ఇలాంటి ఆచరణాత్మక చర్యలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ చొరవ వల్ల యువత ఆర్థిక భారానికి భయపడకుండా పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుందన్నారు.
ఖలాఫ్ అల్ హబ్దూర్ కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు.. యూఏఈ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఇన్‌ఫ్లుయెన్షియల్ వ్యక్తి. 1970లో స్థాపించబడిన అల్ హబ్దూర్ గ్రూప్ ప్రస్తుతం హాస్పిటాలిటీ, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, పబ్లిషింగ్ వంటి అనేక రంగాల్లో వేలమందికి ఉపాధినిస్తోంది. గతంలో కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్ చైర్మన్‌గా, యూఏఈ ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన సేవలు అందించారు. పిల్లలే దేశ భవిష్యత్తుకు పెట్టుబడి అని, బలమైన కుటుంబాలే దృఢమైన దేశాన్ని నిర్మిస్తాయని ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇందుకోసం ఆయన చేస్తున్న ప్రయత్నం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రేజీ ఆఫర్ గురించి విన్న నెటిజన్లు బాస్ అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
