సిరిసిల్ల వాసుల క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించిన దుబాయ్

సిరిసిల్ల వాసుల క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించిన దుబాయ్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: వలస జీవుల కుటుంబాల ఆశలు ఆవిరయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు దుబాయ్​లో ఓ హత్య కేసులో ఇరుక్కొని 15 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వారి క్షమాభిక్ష పిటీషన్​ను దుబాయ్ కోర్టు సోమవారం కొట్టివేసింది. 2004లో దుబాయ్ వలస వెళ్లిన రాజన్నసిరిసిల్ల జిల్లా వాసులు పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి,చందుర్తికి చెందిన గోలం నాంపల్లి, శివరాత్రి హన్మాండ్లు , కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్.. ​ 2006లో నేపాల్​కు చెందిన వాచ్​మాన్ బహుద్దూర్ సింగ్ హత్య కేసులో ఇరుక్కున్నారు. నేరం రుజువు కావడంతో కోర్టు వీరికి 25 ఏళ్ల  శిక్ష వేసింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల అయ్యే అవకాశం ఉంటుంది.దీంతో 2013లో ఎమ్మెల్యే కేటీఆర్ నేపాల్​కు కూడా వెళ్లి వచ్చారు. క్షమాభిక్ష పత్రాలపై బాధిత కుటుంబం సంతకాలు పెట్టేందుకు  రూ.15లక్షల పరిహారాన్ని కూడా అందించారు. ఇది జరుగుతుండగానే దుబాయ్ చట్టాల్లో మార్పులు వచ్చి క్షమాభిక్షలు రద్దయ్యాయి.  దీంతో 15 ఏళ్లుగా జైలులో ఉన్న సిరిసిల్ల వాసులు తిరిగి  కొత్త చట్టం ప్రకారం మరోసారి క్షమాభిక్ష దరఖాస్తును పెట్టుకున్నారు. 15 ఏళ్లు జైలు శిక్ష పూర్తయినందున.. మిగతా 10 ఏళ్ల జైలు శిక్ష రద్దు చేయాలని కోరారు.  పిటీషన్​ను స్వీకరించిన కోర్టు సోమవారం విచారించి.. క్షమాభిక్ష తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.  క్షమాభిక్ష వస్తుందిఅని అనుకున్నామని, కోర్టు తిరస్కరించడం  దురదుష్టకరమని మంత్రి కేటీఆర్ అన్నారు.  రివ్యూ పిటిషన్ వేస్తామని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు. 

రివ్యూ పిటిషన్​కు అవకాశం ఉంది

తెలంగాణాలోని రాజన్నసిరిసిల్ల జిల్లా వాసుల తరఫున నేనే కేసు చూస్తున్నాను.   జైలు నుంచే ఈ ఐదుగురు క్షమాభిక్షా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రోజు క్షమాభిక్షా దరఖాస్తును తిరస్కరించింది.  ఈ కేసులో రివ్యూకు అవకాశం ఉంది.  రివ్యూ పిటిషన్ వేస్తాను.  హత్యకు గురైన కుటుంబ సభ్యులు వీరికి క్షమాభిక్ష పెట్టారు. పరిహారం తీసుకొని సంతకాలు కూడా చేశారు.ఈ విషయం మీదనే కోర్టులో చట్టబద్దంగా ముందుకు వెళ్తాను. ఈ కేసుకు ప్రభుత్వ సహకారం అవసరం ఉంటుంది.
‑ అనురాధ ఓబిలిశెట్టి, దుబాయ్ లాయర్