
- లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తం
- రాహుల్ అభివృద్ధిని కాదు..అదానీని వ్యతిరేకించారు
- పారిశ్రామిక వేత్తలతో ఐటీ మినిస్టర్ శ్రీధర్‌బాబు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇండస్ట్రియల్ఫ్రెండ్లీ పాలసీ తీసుకువస్తామని ఐటీ, ఇండస్ట్రీస్మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లోని ఎఫ్ టీసీసీఐ భవనంలో ఎఫ్ టీసీసీఐ, ఫిక్కీ, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కీ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త ఇండస్ట్రియల్పాలసీ రూపొందించడానికి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని వెల్లడించారు.
కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడే అనేక పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలను హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిందన్నారు. బీహెచ్ఈఎల్, డీఆర్డీఎల్, డీఎల్ఆర్ఐ, మిధాని వంటి సంస్థలను స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించామని గుర్తుచేశారు. మేనిఫెస్టో ద్వారా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, వాటితో పాటు పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు.
యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ముందుకెళ్తామని, ప్లాన్ 2050 గురించి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేసిందని విమర్శించారు. తమకు రాజకీయం చేయడం అలవాటు లేదని, రాష్ట్రాన్ని ఎలా బాగు చెయ్యాలన్న ఆలోచన, తపనతో ప్రతి క్షణం పని చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
చిన్న పరిశ్రమలకు తోడ్పాటు
కరోనా వల్ల ఎంఎస్ఎంఈలు చాలా ఇబ్బందిపడ్డాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అయినా వాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించలేదన్నారు. తమ ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు తోడ్పాటునందిస్తుందని స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలోనూ సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అర్బన్ క్లస్టర్, రీజనల్ క్లస్టర్, సెమీ అర్బన్ క్లస్టర్.. ఇలా మూడు పద్ధతుల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. డ్రైపోర్ట్ ఏర్పాటుకు నల్గొండతో పాటు ఓల్డ్ ముంబై హైవే ప్రాంతాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
కావాలనే టార్గెట్ చేస్తున్నరు
అదానీ కంపెనీ వ్యవహారంలో కొంత మంది కావాలని కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని వర్గాల పారిశ్రామికవేత్తలకు అవకాశమిస్తామన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకించారు కానీ అభివృద్ధిని కాదని వివరించారు. హైదరాబాద్ ప్రపంచానికే కరోనా వాక్సిన్ ఇచ్చేలా అభివృద్ధి చెందిందని, అభివృద్ధి చెందిన దేశాలు కూడా హైదరాబాద్ ను ఫార్మా ఇండస్ట్రీ హబ్ గా గుర్తిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ లో మిస్సైల్ తయారై ఇజ్రాయిల్ కి ఎగుమతి అవుతున్నదంటే పారిశ్రామిక రంగం ఎంత అభివృద్ధి చెందిందో తెలిసిపోతుందని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో వివిధ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.