ఢిల్లీలో ఎయిర్ ప్యూరిఫయర్లకు మస్తు గిరాకీ

ఢిల్లీలో ఎయిర్ ప్యూరిఫయర్లకు మస్తు గిరాకీ
  •     గాలి కాలుష్యంతో భారీగా పెరిగిన సేల్స్ 
  •     స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు వింటర్ హాలిడేస్
  •     పొల్యూషన్​తో వింటర్ బ్రేక్ ప్రీపోన్ చేసిన ప్రభుత్వం
  •     ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన క్యాబ్స్ పై నిషేధం

న్యూఢిల్లీ : ఢిల్లీలో గాలి కాలుష్యం కారణంగా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. సిటీలో ఎయిర్ క్వాలిటీ సివియర్ కేటగిరీకి పడిపోవడంతో జనం ఎయిర్ ప్యూరిఫయర్లను కొనుగోలు చేస్తున్నారు. ఢిల్లీతోపాటు ముంబై నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చెబుతున్నాయి. గత నాలుగైదు రోజుల్లోనే 15 నుంచి 20 శాతం సేల్స్ పెరిగాయని కెంట్ ఆర్వో కంపెనీ సీఎండీ మహేశ్ గుప్తా తెలిపారు. తమ సేల్స్ 10 రెట్లు పెరిగాయని షియోమీ ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఆన్ లైన్ లోనూ ఎయిర్ ప్యూరిఫయర్ల కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. 

ముందుగానే వింటర్ హాలీడేస్.. 

ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ పెరిగింది. మంగళవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 395 (వెరీ పూర్ కేటగిరీ)గా నమోదు కాగా, బుధవారం నాటికి 421 (సివియర్ కేటగిరీ)కి పడిపోయింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. వరుసగా ఆరు రోజుల నుంచి ఎయిర్ పొల్యూషన్ తగ్గకపోవడంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లకు ముందస్తుగా వింటర్ హాలీడేస్ ప్రకటించింది. ఈ నెల 9 నుంచి 18 వరకు అన్ని స్కూళ్లకు హాలీడేస్ ఇస్తున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సివియర్ కేటగిరీకి పడిపోయింది. రానున్న రోజుల్లోనూ ఎయిర్ క్వాలిటీ మెరుగయ్యే పరిస్థితులు లేవని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వింటర్ హాలీడేస్ ని ప్రీపోన్ చేశాం. వీటిని డిసెంబర్, జనవరి మధ్యలో ఇచ్చే వింటర్ హాలీడేస్ లో అడ్జస్ట్ చేస్తాం” అని అందులో పేర్కొంది. కాగా, పొల్యూషన్ కారణంగా ఇప్పటికే స్కూళ్లకు ఈ నెల 3 నుంచి 10 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పొల్యూషన్ తగ్గే పరిస్థితులు లేకపోవడంతో సెలవులను పొడిగించింది.  కాగా, ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన యాప్ బేస్ డ్ క్యాబ్స్.. సిటీలో తిరగడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. మరోవైపు పొల్యూషన్ ను కంట్రోల్ చేసేందుకు ఈ నెల 13 నుంచి మళ్లీ సరి బేసి విధానాన్ని అమలు చేయాలని భావించిన ఢిల్లీ సర్కార్.. ఇప్పుడు దాన్ని వాయిదా వేసింది.   

నాసా ఫొటోలు విడుదల.. 

ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విషపూరితమైన పొగమంచు కమ్ముకుందని నాసా విడుదల చేసిన శాటిలైట్ ఫొటోల్లో తేలింది. ఈ పొగమంచు ఏకంగా పాకిస్తాన్ నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని నాసా తెలిపింది. పొలాల్లో గడ్డి కాల్చివేతలతో నార్త్ ఇండియాలో విపరీతమైన పొగమంచు కమ్ముకుందని చెప్పింది. అక్టోబర్ 29న 1,068 చోట్ల గడ్డిని కాలబెట్టారని పేర్కొంది.