కేసీఆర్ పర్యటనతో పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టులు

కేసీఆర్ పర్యటనతో పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టులు

కరీంనగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లాకు సీఎం కేసీఆర్ వస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులతోపాటు లెఫ్ట్​​ పార్టీల నేతలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేశారు. గృహ నిర్బంధాలు విధించారు. సోమవారం తెల్లవారుజామునే నేతల ఇండ్ల ముందు కు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరును లీడర్లు ఖండించారు. అక్రమ అరెస్టులతో పోరాటాలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే ఉవ్వెత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీపీఐ రామగుండం కార్పొరేషన్ ఏరియా కార్యదర్శి కె.కనకరాజ్, సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ప్రీతంను అదుపులోకి తీసుకుని గోదావరిఖని వన్​టౌన్​ పీఎస్​కు తరలించారు. కరీంనగర్​లో బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, కార్పొరేటర్ అనుప్, పీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్, కాంగ్రెస్ ఎస్సీ,ఎస్టీ  సెల్  పట్టణ అధ్యక్షుడు పోచన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి  కొండ హరీశ్​ను  తెల్లవారు జామునే  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గోదావరిఖనిలో కాంగ్రెస్ నాయకులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ను, రామగుండంలో బీజేపీ నేత, కార్మిక నాయకుడు కౌశిక్ హరిని గృహ నిర్బంధం చేశారు.  ముత్తారం, కాల్వ శ్రీరామ్ పూర్, రామగిరి, పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం ఆయా మండలాల్లో ముఖ్య నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్​ చేస్తున్న జిగిత్యాల జిల్లా మన్నెగూడెం గ్రామస్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.