పొంగిపొర్లిన వాగులు, చెరువులు.. విద్యార్థుల వెతలు

పొంగిపొర్లిన వాగులు, చెరువులు.. విద్యార్థుల వెతలు

మహబూబాబాద్ జిల్లాలో స్కూల్ బస్ కు ప్రమాదం తప్పింది. తొర్రూరు నుంచి నర్సింహులపేటకు విద్యార్థులతో వెళ్తున్న ఆర్యభట్ట స్కూల్ బస్ కొమ్మలవంచ కొత్తచెరువు మత్తడి ధాటికి రోడ్డుపై నుంచి జారింది. వరద నీటిలో చిక్కుకొని కదలలేకపోయింది. స్థానికులు అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బస్సు నుంచి బయటకు తరలించారు. 

తాటిమొద్దుపై కూర్చొని..

భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా అతలాకుతలం అవుతోంది. జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొన్ని చోట్ల వాగులు రోడ్లపై నుంచి ప్రవహిస్తుండడంతో స్కూళ్ల నుంచి తిరిగొచ్చే టైంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. అతికష్టమ్మీద వాగులు దాటారు. నర్సింహులపేట మండల కేంద్రంలో ఎంపీడీవో, ఐకేపీ, సహా హాస్టల్ భవనాలు నీట మునిగాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. అటు దంతలపల్లి మండలం దాట్ల గ్రామంలో వీధుల్లో భారీ వరద చేరడంతో విద్యార్థులు తాటిమొద్దుపై కూర్చొని అతి కష్టమ్మీద ఇళ్లకు చేరుకున్నారు.

స్థానికులు లైన్ లో నిలబడి..

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటికెళ్లే టైంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక చెరువు మత్తడి దూకడంతో కట్టపై వెళ్లే పరిస్థితి లేకపోయింది. దీంతో స్థానికంగా ఉన్న వారు లైన్ లో నిలబడి పిల్లలను ఇవతలి ఒడ్డుకు చేర్చారు. మొత్తం 500 మంది దాకా విద్యార్థులను ఒడ్డు దాటించారు.