సర్కార్ నిర్లక్ష్యంతోనే మిల్లుల్లో కోతలు

సర్కార్ నిర్లక్ష్యంతోనే మిల్లుల్లో కోతలు
  •     వడ్లకు కాంటా అయ్యాకా అడ్డగోలుగా కటింగ్స్  
  •     రైతులను బెదిరించి కోతకు ఒప్పిస్తున్న అధికారులు     
  •      నిరుడు నూక నష్టం భరిస్తామని ఎగ్గొట్టిన ప్రభుత్వం 
  •     ఈ ఏడాదీ చేతులెత్తేయడంతో దోపిడీకి దిగిన మిల్లర్లు 


హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతో రైస్ మిల్లర్లు రైతులను నిలువునా దోచుకుంటున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వడ్లకు మిల్లర్లు అడ్డగోలుగా కోతలు పెడుతున్నా సర్కార్ కనీసం పట్టించుకోవడంలేదు. కొనుగోలు సెంటర్లలో కాంటా పెట్టి లారీల్లో మిల్లులకు తరలిస్తే మిల్లర్లు లారీకి నాలుగైదు బస్తాలు కట్‌‌ చేసుకుంటున్నరు. లేదంటే వడ్లు రిటర్న్‌‌ పంపుతామని బెదిరిస్తున్నరు. దీంతో సెంటర్‌‌ నిర్వాహకులు, అధికారులే రైతులకు సర్దిచెప్తూ కటింగ్ పెట్టేందుకు ఒప్పిస్తున్నరు. ఇలా ఒక్కో లారీ లోడులో నాలుగైదు క్వింటాళ్ల వరకు కోత పడుతోంది. అయితే, నిరుడు యాసంగిలో నూక నష్టం భరిస్తామన్న సర్కారు ఆ డబ్బులు ఎగ్గొట్టినందుకుకే మిల్లర్లు ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

నిబంధనలు బేఖాతర్‌‌ 

నిబంధనల ప్రకారం ప్రతి కొనుగోలు కేంద్రంలో రైస్‌‌ మిల్లర్‌‌ ప్రతినిధి కచ్చితంగా ఉండాలి. కానీ ఏ సెంటర్‌‌లోనూ ప్రతినిధి ఉండటం లేదు. కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యాన్ని రైస్‌‌ మిల్లులకు వచ్చిన తర్వాత తాలు పేరుతో తరుగు తీయడం చట్ట విరుద్దం. కానీ ఇది కూడా యథేచ్ఛగా సాగుతోంది. మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై రైతులను నిలువునా ముంచేస్తున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులను ఇబ్బందులకు గురిచేసి తరుగు పేరుతో కోత విధించే మిల్లర్లపై క్రిమినల్‌‌ కేసులు పెడతామన్న సర్కారు ప్రకటన ఉత్తముచ్చటే అవుతోంది. అలాగే కొనుగోలు సెంటర్లలో నిర్వాహకులు కొన్న ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయడంలేదు. మిల్లర్లు కూడా ధాన్యాన్ని వెంటనే దించుకుని ట్రక్​ షీట్ లో వివరాలు నమోదు చేయాల్సి ఉన్నా కావాలనే జాప్యం చేస్తున్నారు. ఇవన్నీ సరిగ్గా జరిగేలా పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఫిర్యాదులున్నాయి.   

నూక శాతం తేల్చని సర్కార్ 

బాయిల్డ్‌‌ రైస్‌‌ వివాదం నేపథ్యంలో నూకలు ఎక్కువ వస్తే ఆ మేరకు నష్టాన్ని భరిస్తామని ప్రకటించిన రాష్ట్ర సర్కారు ఏడాది అవుతున్నా ఆ లాస్​ను భరించలేదు. కనీసం నూకశాతం ఎంత అనేది కూడా తేల్చకుండా నిర్లక్ష్యం చేసింది. క్వింటాల్‌‌కు రూ.270 నష్టం వస్తుందని మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీఎఫ్ఎఆర్ఎస్ఐ) అంచనా వేసింది. సర్కారు ఆ రిపోర్టును బయటపెట్టకుండా ఏడాదిగా నాన్చుతోంది. ఇది తేలితే కానీ ప్రభుత్వం ఎంత లాస్‌‌ భరిస్తుందనే స్పష్టత వస్తుంది. ఇప్పటికీ దీనిపై సర్కార్ తేల్చకపోవడంతో చేతులెత్తేసినట్లేనని తెలుస్తోంది. నిరుడు యాసంగిలో సివిల్‌‌ సప్లయ్స్‌‌ సేకరించిన 50 లక్షల టన్నుల వడ్లకు నూక నష్టాన్ని భరిస్తే రూ.1,350 కోట్ల వరకు సర్కారు మిల్లర్లకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ దీనిపై సర్కారు ఏమీ తేల్చకపోవడంతో చేతులెత్తేసినట్లేనని స్పష్టమవుతోంది. దీంతో మిల్లర్లు ధాన్యంపై ఇష్టానుసారంగా కోతలు పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

అధికారులే బెదిరిస్తున్నరు 

వడ్లు కాంటా అయిన వెంటనే సివిల్ సప్లైస్‌‌ అధికారులు రైతులకు రసీదు ఇవ్వాలి. వడ్లు ఎన్ని క్వింటాళ్లు అయినయో రసీదులో పేర్కొని, ఆ మేరకు రైతుకు డబ్బులు చెల్లించాలి. కానీ, కాంటా అయిన తర్వాత కూడా రసీదు ఇవ్వకుండా రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. వడ్ల లోడు మిల్లుకు వెళ్లిన తర్వాత, మిల్లర్ 40 కిలోల బస్తాకు కిలో, రెండు కిలోల చొప్పున కటింగ్ పెడుతున్నాడు. ఈ కటింగ్‌‌కు రైతులను ఒప్పించే బాధ్యతను సివిల్ సప్లైస్ అధికారులే తీసుకుంటున్నారు. కటింగ్‌‌కు ఒప్పుకోకపోతే వడ్లు దించుకోరట, రిటర్న్ పంపిస్తరట అని రైతులను అధికారులే బెదిరిస్తున్నారు. దీంతో చేసేదేం లేక రైతులు కటింగ్‌‌కు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిజానికి రైతులకు మిల్లర్‌‌‌‌లతో ఎలాంటి సంబంధం లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాల్సిన ప్రభుత్వమే.. మిల్లర్లు రైతులను దోచుకునేలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.    

బెదిరించి కోతకు ఒప్పిస్తున్రు


నేను 8 ఎకరాల్లో వరి వేసిన. 380 బస్తాలు పండినయి. కాంటా పెట్టేటప్పుడు బస్తాకు రెం డున్న కిలోల తరుగు తీశారు. వడ్లు మిల్లుకు వెళ్లిన తర్వాత వెయిట్ లాస్ పేరిట ఇంకో 3బస్తాలు కోత పెట్టారు. ఎన్నిసార్లు కోతలు పెడ్తరని అడిగినా రైస్ మిల్లు యజమానులు, అధికారులు పట్టించుకోలేదు. కోతకు ఒప్పుకుంటేనే పైసలు వస్తాయని, లేకుంటే మళ్లా వడ్లు తెచ్చి మార్కెట్లో పోస్తరని బెదిరించడంతో ఒప్పుకోక తప్పలేదు. రైతులందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది. 
- తిరుపతి రెడ్డి, అప్పారావు పేట్, 
జగిత్యాల జిల్లా