రెండు నేషనల్​ హైవేలతో పెరిగిన రద్దీ

రెండు నేషనల్​  హైవేలతో పెరిగిన రద్దీ
  •     కల్వకుర్తి, నాగర్​ కర్నూల్​ వెళ్లేందుకు ఒకే రోడ్డు ..
  •     కంట్రోల్​ చేసేందుకు జాడ లేని ట్రాఫిక్ పోలీసులు
  •     ట్రాఫిక్ పోలీస్​స్టేషన్​​ నిర్మాణ పనులు ఏడాదైనా ఏడియాడనే ..

జడ్చర్ల టౌన్, వెలుగు:  జడ్చర్లలో ట్రాఫిక్​ జాం సమస్యతో  వాహనదారులు బేజారవుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ట్రాఫిక్​పోలీసులు..  ఫోకస్​పెట్టకపోవడంతో మున్సిపాల్టీ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.

సెంటర్​ పాయింట్​..

హైదరాబాద్​, కోదాడ, మిర్యాలగూడ, రాయచూర్​, మహబూబ్​నగర్​ ప్రాంతాలకు జడ్చర్ల సెంటర్​ పాయింట్​గా ఉంటుంది. ఎన్​హెచ్​-–44, ​-167 ఇక్కడి నుంచే ఉండడంతో వెహికల్స్​రాకపోకలు భారీగా పెరిగాయి. గతంలో నిర్మించిన రోడ్లు పెరిగిన ట్రాఫిక్​కు తగినట్లు లేకపోవడం, జడ్చర్ల రైల్వే గేట్​ను శాశ్వతంగా మూసెయ్యడంతో ట్రాఫిక్​ సమస్య మరింత పెరిగింది. ప్రస్తుతం ఎవరు ఎటు నుంచి వచ్చినా నాగర్​ కర్నూల్​ రోడ్డు మీదుగానే  రావాల్సి వస్తోంది.  దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా ట్రాఫిక్​ జామ్​ అవుతోంది. ఇదే టైంలో వ్యాపారాలు లారీలను రోడ్లపైనే నిలుపుతుండటం, ఆర్టీసీ బస్సులకు సరైన రిక్వెస్ట్​ స్టాప్​లు లేకపోవడం, ఆటోలను ఎక్కడిపడితే అక్కడ ఆపుతుండటంతో రోడ్లు జామ్​ అవుతున్నాయి.  దీంతో పాటు కర్ణాటక, నల్లగొండ జిల్లాలకు వెళ్లే భారీ వెహికల్స్​కూడా పట్టణం నుంచే వెళ్తుండటంతో ట్రాఫిక్​లో చిక్కుకుంటున్నాయి. 

రోడ్డు వెడల్పు పనులతో మరింత పెరగనున్న సమస్య

జడ్చర్ల నుంచి దేవరకొండ, డిండి, అచ్చంపేట, నాగర్​కర్నూల్​, మహబూబ్​నగర్​, షాద్​నగర్​, హైదరాబాద్​, కల్వకుర్తి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారంతా పట్టణంలోని సిగ్నల్​ గడ్డ మీదుగానే వెళ్లాలి. వేరే ఆల్టర్నేట్​ రోడ్డు లేదు. అయితే, సిగ్నల్​ గడ్డ వద్ద రోడ్డు వెడల్పు పనులు చేపడ్తామని ఆఫీసర్లు చెప్పారు. రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయితే  ట్రాఫిక్​ సమస్య డబుల్​ కానుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనులు స్టార్ట్​ చేయడానికి ముందే ఆఫీసర్లు ట్రాఫిక్​సమస్యలు లేకుండా ఆల్టర్నేట్​ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

ముందుకు పడని ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ నిర్మాణం

జడ్చర్ల పోలీస్​ స్టేషన్​ సమీపంలో ఉన్న సీఐ క్వార్టర్స్​ శిథిలావస్థకు చేరండంతో కొన్నేళ్ల కింద  కూల్చివేశారు. స్థలం అందుబాటులో ఉండడంతో, ఇక్కడ ట్రాఫిస్​ పోలీస్​ స్టేషన్​ ఏర్పాటుకు ప్రపోజల్స్​పెట్టారు. ఈ మేరకు గతేడాది ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు నిర్మాణ పనులు ఏడియాడనే ఉన్నాయి.  స్థలం చుట్టూ ఫెన్సింగ్​ వేశారే తప్పా.. పనులు ప్రారంభించలేదు.

ట్రాఫిక్​ పోలీసుల కొరత

పట్టణంలో ట్రాఫిక్​ సమస్య తీవ్రమవుతున్నా.. దీన్ని కంట్రోల్​చేసేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు. ట్రాఫిక్​ పోలీసుల కొరత ఉండటంతో  మెయిన్​ జంక్షన్లు నేతాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, కొత్త బస్టాండ్ ప్లై ఓవర్ వద్ద ఎవరూ  ఉండడం లేదు. దీంతో ఆటోలు, సెజ్​ కంపెనీలకు వెళ్లే బస్సులను రోడ్ల మీదనే అడ్డగోలుగా ఆపుతున్నారు. 

శంకుస్థాపన చేశారు.. వదిలేశారు..

ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ కోసం ఏడాది కింద శంకుస్థాపన చేశారు. కానీ ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. ఇప్పటికే పట్టణంలో ట్రాఫిక్​ సమస్య తీవ్రంగా ఉంది.  వెంటనే రద్దీ  ప్రాంతాల్లో ట్రాఫిక్​ పోలీసులను నియమించి, సమస్యను పరిష్కరించాలి.  - రాజు, 10వార్డు కౌన్సిలర్, జడ్చర్ల

అన్నింటికీ ఒకే దారి 

జడ్చర్ల కొత్త బస్టాండ్ నుంచి పట్టణంలో ఎంట్రీ అయ్యామంటే నేతాజీ చౌరస్తా వరకు ట్రాఫిక్ సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. కొత్త బస్టాండ్ నుంచి కల్వకుర్తి , నాగర్ కర్నూల్ కు ఒకే రోడ్డు ఉంది. ఆ రోడ్డుపై వందల వెహికల్స్​రాకపోకలు, రోడ్లపై చిరు వ్యాపారులు,  అధ్వానంగా ఉన్న రోడ్లతో అవస్థలు పడుతున్నాం. - లింగం గౌడ్, ఆటో డ్రైవర్, మాచారం