వికారాబాద్ జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు

వికారాబాద్ జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు
  • చాలా గ్రామాలకు నిలిచిన రాకపోకలు 

వికారాబాద్/షాద్​నగర్​, వెలుగు : వికారాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కురిసిన వర్షానికి ఎన్నారం వాగు బ్రిడ్జి పై నుండి భారీ ఎత్తున వరద పారడంతో కోట్​పల్లి నుంచి బంట్వారం, మర్పల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్నాపూర్​ - అత్తాపూర్, -కంకణాలపల్లి, నాగసమందర్,​- ధారూర్, బంట్వారం–- నూర్లాపూర్​, యాచారం, గ్రామాల మద్య ఉన్న వాగులు సైతం పొంగిపొర్లడంతో ఆయా గ్రామాలకు వెళ్లే జనం ఇబ్బంది పడ్డారు.బంట్వారం మండల కేంద్రంలో  ఎస్సీ కాలనీలో ఇండ్లలోకి వరద నీరు చేరుకుంది. దాదాపు 22 ఏండ్ల కిందట 1999లో ఇలా ఇండ్లల్లోకి నీరు చేరిందని.. ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితిని చూస్తున్నామని బంట్వారం వాసులు తెలిపారు.  

బెల్కటూరులో కూలిన ఇల్లు
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తాండూరు మండలం బెల్కటూర్​ గ్రామానికి చెందిన కైరత్ అలీ ఇల్లు కూలిపోయింది. ఓ రూమ్ పై కప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో పక్క రూమ్​లో  నిద్రపోతున్న కైరత్ అలీ, అతడి కుటుంబీకులు  లేచి బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గ్రామ సర్పంచ్ మదన్ మోహన్ రెవెన్యూ అధికారులకు తెలిపాడు.

కొత్తూరు ఎంఆర్సీ బిల్డింగ్​లోకి నీరు.. 
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో సోమవారం కురిసిన వానకు విద్యాశాఖకు చెందిన ఎంఆర్సీ బిల్డింగ్​లోకి వరద నీరు చేరింది.  దీంతో అక్కడ ఉన్న పుస్తకాలు నీటిలో తడిసిపోయాయి. చిన్న వర్షానికే నీరు బిల్డింగ్​లో చేరుతోందని సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం చాలావరకు పుస్తకాలు తడిసిపోయాన్నారు.  నందిగామ మండలం నరసప్పగూడ గ్రామంలోని ప్రభుత్వ స్కూల్​లో వర్షపు నీటితో పాటు మురుగునీరు చేరింది. క్లాస్ రూమ్​లోనూ మోకాలి లోతు వరకు నీరు చేరడంతో సిబ్బంది స్టూడెంట్లను ఇండ్లకు పంపించారు. స్కూల్​కు ఇప్పటికైనా రిపేర్లు చేయించాలని స్టూడెంట్ల తల్లిదండ్రులు కోరుతున్నారు. షాద్ నగర్ పట్టణం లోని జహంగీర్ దర్గాలో వర్షపు నీరు చేరింది. దీంతో దర్గాకు వచ్చే వారు ఇబ్బంది పడ్డారు.