ఆరేళ్ల తర్వాత తండ్రి, కొడుకులను కలిపిన టిక్ టాక్

ఆరేళ్ల తర్వాత తండ్రి, కొడుకులను కలిపిన టిక్ టాక్

కర్నూలు: ఈ మధ్య కాలంలో ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకున్న సోషల్ మీడియా ఒక సంచలనం అని చెప్పొచ్చు. సందర్భం ఏదైనా, సంతోషమైనా, బాధ అయినా.. టిక్ టాక్ తో పంచుకోవడం పరిపాటిగా మారింది. ఈ యాప్ ద్వారా కొందరు తమ టాలెంట్ ను ప్రదర్శిస్తుంటే,  మరి కొందరు తమ స్వంత విషయాలను ఇతరులతో పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక పెద్డ ప్రసార అనుసంధానంగా మారిన టిక్ టాక్ వల్ల  ఒక కుటుంబం నుండి విడిపోన వ్యక్తి  తిరిగి కలుసుకున్నాడు.

ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్టు.. తండ్రి కోసం ఓ కొడుకు చేసిన టిక్ టాక్ వీడియో వల్ల..  6 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన ఆ కుటుంబ పెద్దను తిరిగి కలుసుకొనే అవకాశం వచ్చింది.

నంద్యాల లోని హరిజన పేటకు చెందిన అనుపూరి పుల్లయ్య గత 6 సంవత్సరాల నుండి కనపడకుండా పోయాడు. అయితే కుటుంబ సభ్యులు అన్నీ చోట్ల గాలింపు చేపట్టి.. చనిపోయి ఉంటాడని నిర్ధారించుకొని కర్మ కాండలు కూడా చేశారు. సరదాగా టిక్ టాక్ వీడియోలు చేసే అనుపూరి నరసింహులు తన తండ్రి పుల్లయ్య గురించి సదరు యాప్ లో  ఓ పోస్ట్ పెట్టాడు. “ఒకప్పుడు సంపాదించలేని టైమ్ లో డాడీ ముందు ఉన్నాడు సార్. నేను సంపాదించే టైమ్ వచ్చే సరికి డాడీ లేడు సార్”అని తన తండ్రి ఫోటో తో టిక్ టాక్ చేసి పోస్ట్ చేశాడు.

ఈ  వీడియో చక్కర్లు కొట్టుకుంటూ తండ్రి దగ్గరకు చేరింది. వెంటనే తండ్రి తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తండ్రి ఆచూకీ తెలియడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తండ్రి గుజరాత్ లో ఉన్నాడని తెలుసుకున్న ఇద్దరు కుమారులు గుజరాత్ వెళ్లి తండ్రి ని కలుసుకున్నారు. ఏది ఏమైనా తండ్రి కొడుకులను కలిపిన టిక్ టాక్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.