
‘మహానటి’ తర్వాత మరో తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్, స్వప్నా దత్ నిర్మిస్తున్నారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ లవ్ స్టోరీలో దుల్కర్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. నిన్న తన పుట్టినరోజు కావడంతో స్పెషల్ పోస్టర్‌తో పాటు వీడియో గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు. లెఫ్టినెంట్ రామ్‌గా మంచు కొండల్లో డ్యూటీ చేస్తూ కనిపించాడు దుల్కర్. తనో అమ్మాయి కోసం తపన పడుతున్నట్టుగా ఉన్నాయి విజువల్స్. అతని లుక్‌తో పాటు విశాల్ చంద్రశేఖర్ బ్యాగ్రౌండ్ స్కోర్, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్ చూస్తే.. ఎవరో సైకిల్ తొక్కుతుంటే వెనక ఇటువైపు తిరిగి కూర్చున్నాడు దుల్కర్. చేతిలో చిన్న లెటర్ ఉంది. సైనికులు తనని ఫాలో చేస్తున్నారు. పోస్టర్‌పై ఉన్న పోస్టల్ స్టాంప్స్‌ని బట్టి ఇది 1964 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. ఓవైపు యుద్ధం, మరోవైపు ప్రేమ.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమా ఉంటుంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకైనప్పటికీ ఆ ఇమేజ్ తనపై పడకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్నాడు దుల్కర్. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ నటిస్తున్నాడు. తను నటించిన కురుప్, సెల్యూట్ అనే రెండు మలయాళ చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.