
వెలుగు: పోకిరీ సినిమాలో మహేశ్‌బాబులా అండర్ కవర్ కాప్ నంటూ ఆరేళ్లుగా చెలామణి అవుతున్నాడో వ్యక్తి. నకిలీ ఐడీ కార్డు, నేమ్ ప్లేట్ తయారు చేయించుకుని దర్జాగా తిరుగుతున్నాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్నటాస్క్‌ఫోర్స్ పోలీసులు ‘పోకిరీ’ పోలీస్‌ను అరెస్టుచేసి కటకటాల వెనక్కి నెట్టారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన వివరాల ప్రకారం..ఎమ్ వీ.రవిచంద్ర(29) సొంతూరు కొత్తగూడెం జిల్లా పాల్వంచ. తండ్రి సింగరేణిలో ఉద్యోగి. టెన్త్ వరకు పాల్వంచలోనే చదివాడు. తండ్రికి ట్రాన్స్‌ఫర్ కావడంతో 2004లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి మారారు. పటాన్‌చెరు బీరంగూడలోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్‌లో చేరి 2012లో ఫైనల్ ఇయర్‌లో ఫెయిలయ్యాడు. 2013 లో సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లికి మకాం మార్చాడు. అక్కడ కొన్నాళ్లు డేటాఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేశాడు.
‘పోకిరీ’ ఆలోచన
పోలీస్ యూనిఫాం మీద రవిచంద్రకు మోజుండేది. తనకు తాను పోలీస్‌నని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. 2012లో డీఎస్పీగా సెలక్ట్ అయ్యానని ఫ్రెండ్స్‌తో చెప్పాడు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ లో ఏసీపీగా పనిచేస్తున్నానని అందరినీ నమ్మించాడు. తను అద్దెకుండే అపార్ట్‌మెంట్ వాసుల ముందు అండర్ కవర్ కాప్ నని బిల్డప్ ఇచ్చేవాడు. 2015 ఆగస్టులో తన కారు డ్రైవర్‌తో కలిసి రాహుల్ కాంత్అనే వ్యక్తిపై దాడి చేయడంతో నేరెడ్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో రెండు రోజులు జైల్లోఉన్నాడు. ఆ తర్వాత మకాంను వెస్ట్ మారేడ్‌పల్లికి మార్చాడు. అక్కడ కూడా అండర్ కవర్ కాప్ నని చెప్పుకున్నాడు.
కిరాయి కార్లకు పోలీస్ నేమ్ ప్లేట్
అప్పుడప్పుడు ఇన్నోవా కార్లను అద్దెకుతీసుకుని దానిపై పోలీస్ నేమ్ బోర్డ్ పెట్టుకునేవాడు. “ఎమ్‌వీ. రవిచంద్ర, డిప్యూటీ సూపరింటెండెంట్ 486, టీఎస్ పోలీస్, ఐడీ: 2018054819” అనే నేమ్ ప్లేట్ తయారు చేయించుకుని తను ఉండే ఇంటికి తగిలించుకున్నాడు. ఏదైనా పని ఉంటే నకిలీ ఐడీ కార్డు చూయించి చేయించుకునేవాడు. తను పోలీస్‌నంటూ చాలా మందిని బెదిరించినట్టు ఆరోపణలున్నాయి . ఈ విషయంపై సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్‌ఐలు మల్లికార్జున్, దుర్గారావులు రవిచంద్ర ఇంటిపై దాడిచేసి పోలీస్ డ్రెస్ క్లాత్, డిప్యూటీ సూపరింటెండెంట్ 486 పేరుతో ఉన్న ఐడీ కార్డు, పోలీస్ నేమ్ ప్లేట్, ఏసీపీ ఇంటెలిజెన్స్ (ఏటీఎస్) పేరుతో ఉన్న మెడికల్ సర్టిఫికెట్లు, గ్రీన్ పెన్ స్వాధీనం చేసుకున్నారు.