Dasara Special: ముక్కోటి దేవతలు.. దుర్గాదేవికి ఇచ్చిన ఆయుధాలు ఇవే.. ఏ దేవుడు ఏమి ఇచ్చాడంటే..!

Dasara Special:  ముక్కోటి దేవతలు.. దుర్గాదేవికి ఇచ్చిన ఆయుధాలు ఇవే.. ఏ దేవుడు ఏమి ఇచ్చాడంటే..!

నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాష్టమిరోజున  అమ్మవారిని విశేషంగా పూజిస్తారు.  దుర్గాదేవి ఆరాధన వల్ల దుష్టశక్తులు,భూత , ప్రేత , పిశాచ , రాక్షస బాధలుండవని పండితులు చెబుతున్నారు.  దుర్గా రూపం  ...అరిషడ్వర్గాలను జయించేందుకు.. లక్ష్మీ రూపం ... ఐశ్వర్యం కోసం .. సరస్వతీ రూపం...  జ్ఞాన సముపార్జన కోసం ప్రతీక అని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

 ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి  తిథి రోజు దుర్గా దేవి అమ్మవారికి పరమ ప్రీతికరమైన రోజు. దీనినే మహాష్టమి లేదా మహా దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. ఈసారి ఈ దుర్గాష్టమి పండుగ సెప్టెంబర్‌ 30వ తేదీన జరుపుకోనున్నారు. 9 రోజుల పాటు జరిగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టమి రోజు దుర్గాష్టమి పర్వదినం ఆచరిస్తారు. దుర్గా దేవి అనుగ్రహం కోసం దుర్గాష్టమి వ్రతం ఆచరిస్తారు. దుర్గాష్టమి రోజు భక్తిశ్రద్ధలతో ఆచరించే ఆరాధనలు, పూజలు అమ్మవారికి ప్రీతికరమైనవి, అత్యం పవిత్రమైన దుర్గాష్టమి రోజు చాలా మంది కన్యా పూజ  ఆచరిస్తారు. 

దసరా నవరాత్రుల్లో అత్యంత విశిష్టమైన రోజుగా, అపారమైన శక్తులకు ప్రతీకగా దుర్గాష్టమి పర్వదినాన్ని ఆచరిస్తారు. ఈరోజున(సెప్టెంబర్​ 30)  పూజించే అమ్మవారి రూపం మహిషాసురమర్దిని. అంటే మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి అని అర్థం. 

ఇక దుర్గాష్టమి రోజు ఆచరించే దుర్గాష్టమి కథ విషయానికొస్తే..

పూర్వం రంభుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. అతడు మహిషి (గేదె) రూపంలో ఉన్న రాక్షసిని మోహించి వివాహం చేసుకుంటాడు. వారికి జన్మించినవాడే ఈ మహిషాసురుడు. గేదె తల, మనిషి మొండెం కలిగిన ఈ రాక్షసుడు అపారమైన శక్తియుక్తులతో లోకాలను జయించాలనే కోరికతో బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. 

మహిషాసురుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీరు కోరిన వరం ఇస్తానని హామీ ఇస్తారు. అప్పుడు మహిషాసురుడు 'నాకు పురుషులు లేదా దేవతల చేతిలో మరణం లేకుండా వరం ఇవ్వండి' అని కోరుతాడు. వెంటనే బ్రహ్మ ఆ వరాన్ని ఇచ్చాడు.  వరం పొందిన తర్వాత మహిషాసురుడు అహంకారంతో దేవలోకాన్ని ఆక్రమించాడు. దేవతలందరినీ నానా రకాలుగా ఇబ్బందిపెడుతుంటాడు. మహిషాసురుడి అరాచకాలను తట్టుకోలేని దేవతలు త్రిమూర్తులకు మొరపెట్టుకుంటారు. 

అప్పుడు త్రిమూర్తులు, దేవతలు అందరూ బాగా మథనం చేసిన తర్వాత శక్తి, తేజస్సుతో ఒక దివ్య శక్తి ఉద్భవిస్తుంది.  అనంతమైన తేజస్సుతో, అపారమైన సౌందర్యంతో ఆవిర్భవించిన ఆ శక్తే దుర్గా దేవి. దివ్యశక్తులతో ఉద్భవించిన దుర్గాదేవికి మహిషారుసుడిని సంహరించడానికి దేవతలందరూ తమ తమ శక్తివంతమైన ఆయుధాలను సమర్పిస్తారు.

 అవేమిటంటే.. శివుడు - త్రిశూలం, విష్ణువు - సుదర్శన చక్రం, వరుణుడు - శంఖం, వాయుదేవుడు - బాణాలు, ధనుస్సు, ఇంద్రుడు - వజ్రాయుధం, హిమవంతుడు - సింహం ఇలా పది చేతుల్లో శక్తివంతమైన ఆయుధాలు ధరించి సింహ వాహనాన్ని అధిరోహించిన దుర్గాదేవి భయంకరమైన ఒక్క గర్జన చేసింది.. ఆ గర్జనకు ముల్లోకాలు కంపించాయి.

మహిషాసుర సంహారం

దుర్గాదేవి గర్జన విన్న మహిషాసురుడు ఒక స్త్రీ తనపై యుద్ధానికి వచ్చిందని గర్వంగా భావించి ఆమె శక్తిని తక్కువ అంచనా వేశాడు. తన అనుచరులను, సేనలను, రాక్షస వీరులను దుర్గాదేవిపై యుద్ధానికి పంపిస్తాడు. దుర్గాదేవి అసామాన్య పోరాట పటిమతో ఒక్కొక్క రాక్షసుడిని సంహరిస్తూ వస్తుంది. చివరగా మహిషాసురుడే యుద్ధానికి వచ్చాడు. అతనికి ఉన్న మహిమల వల్ల గేదె, సింహం, మనిషి ఇలా రూపాలు మార్చుకుంటూ అమ్మవారిని కలవరపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ దుర్గా దేవి దివ్యశక్తితో అతని ప్రతి మాయను ఛేదిస్తూ వస్తుంది. చివరిగా మహిషాసురుడు గేదె రూపంలో ఉన్నప్పుడు ఆ రూపం నుంచి మనిషి రూపంలో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దుర్గాదేవి త్రిశూలాన్ని అతని గుండెలపై దింపి.. శిరస్సును ఖండిస్తుంది. అంతటితో ఆ రాక్షసుడి పీడ విరగడవుతుంది. దీంతో లోకంలో శాంతి నెలకొంటుంది. అలాగే.. మహిషాసురుడిపై దుర్గాదేవి విజయం సాధించిన రోజునే దుర్గాష్టమిగా జరుపుకుంటారు.

 ఈ రోజున  అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.  పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచివెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. 

శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు భక్తిగా పూజలు చేస్తారు. కాళీ అమ్మవారి నుదిటి భాగం నుంచి దుర్గ ఉద్భవించిందని కొందరు చెబుతారు. అందుకే కనకదుర్గను కాళీ, చండీ, రక్తబీజగా కొలుస్తారు. 

మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు. "లోహుడు" అనే రాక్షసుడిని దుర్గాదేవి వధిస్తే లోహం పుట్టిందని..అందుకే ఈ రోజు లోహపరికరాలని పూజిస్తారని చెబుతారు. 
దుర్గ అంటే దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలిగించేది దుర్గ.. దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి కనకదుర్గ.. లలితా సహస్రనామంలో అమ్మవారికి ‘సద్గతి ప్రదా’ అనే నామం ఉంటుంది.. దుర్గ అనే నామం ...గత జన్మ వాసనలను పూర్తిగా తుడిచేసి దుర్గుణాలను సద్గుణాలుగా మారుస్తుందని..సంతోషాన్నిస్తుందని చెబుతారు