కనీస మద్దతు ధరకు కేంద్రం ఓకే

కనీస మద్దతు ధరకు కేంద్రం ఓకే

చండీగఢ్: కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నిరసనలు నిర్వహిస్తున్నారు. అన్నదాతలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు నిర్వహించినప్పటికీ అవి సఫలం కాలేదు. తాజాగా ఈ అంశంపై హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా స్పందించారు.

కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పీ) కల్పిస్తామని లిఖిత పూర్వకంగా చెప్పాలన్న రైతుల డిమాండ్‌‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని దుష్యంత్ తెలిపారు. ‘నేను కూడా ఓ రైతునే. దీన్ని నేను ఖండించలేదు. రైతులు పండించిన పంటలకు సరైన ధర వచ్చేలా చేయడం మనందరి బాధ్యత. ఎంఎస్‌‌పీ ఇస్తామని కేంద్రం లిఖిత పూర్వకంగా రాసివ్వాలన్న రైతుల డిమాండ్‌‌కు కేంద్రం అనుకూలమని చెప్పింది. ప్రభుత్వ ప్రతిపాదనపై రైతుల యూనియన్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది వారికే వదిలేస్తున్నాం. ఇతర రాష్ట్రాల రైతులు లేవనెత్తుతున్న సమస్యలు కూడా పరిష్కారం కావాలి’ అని దుష్యంత్ పేర్కొన్నారు.