
కరోనా, వానలు, వరదలతో ఎక్కడోళ్లు అక్కడే
కళతగ్గిన బతుకమ్మ ఆటపాటలు
సిటీ నుంచి ఏటా 20 లక్షల మంది సొంతూర్లకు..
ఈ సారి ఖాళీగా బస్సులు
హైదరాబాద్, వెలుగు: దసరా.. తెలంగాణలో అన్ని పండుగలకంటే పెద్ద ఫెస్టివల్. ఎంగిలి పూల నుంచి సద్దుల వరకు దినాం ఫుల్ జోష్‌తో బతుకమ్మ ఆటలు, పాటలు. సంబూరంగా సాగే శమీ పూజ, దేవీ నవరాత్రి ఉత్సవాలు. జనాలతో షాపింగ్‌మాల్స్, మార్కెట్ల కళకళ. పది రోజుల ముందునుంచే సొంతూర్లకు పోయేటోళ్లతో రైళ్లు, బస్సులు ఫుల్… కానీ ఈసారి దసరా పండుగకు జోష్ కనిపిస్తలేదు. కరోనా మహమ్మారికి తోడు, భారీ వర్షాలు, వరదతలో పండుగ జోర్దార్ తగ్గింది.
సొంతూర్లకు పోతలేరు
దసరా వచ్చిందంటే పది రోజుల ముందే సొంతూర్లకు ప్రయాణమయేటోళ్లు. ప్రభుత్వం కూడా స్కూళ్లకు, కాలేజీలకు10 రోజులు సెలవులు ఇచ్చేది. దీంతో పట్నంలో ఉన్నోళ్లు ఊర్లకు.. ఊర్లలో ఉన్నోళ్లు సిటీలకు పోయేటొళ్లు. తెలంగాణలో పెద్ద పండుగ కావడంతో హైదరాబాద్ సగం ఖాళీ అయ్యేది. సుమారు 20లక్షలకు పైగా మంది జనాలు సొంతూర్లకు బయలుదేరేవారు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు, వేరే దేశాల్లో ఉండే వారు కూడా పండుగ కోసమే ప్రత్యేకంగా వచ్చేటోళ్లు. కానీ ఈ సారి మాత్రం ఇందులో సగం మంది కూడా సొంతూర్లకు వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు.
దెబ్బ మీద దెబ్బ
కరోనా.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. దాని ఎఫెక్ట్‌తో అనేక మంది ఉద్యోగాలు ఊడాయి. చాలా మందికి జీతాల్లో కోత పడింది. బిజినెస్‌లు లాస్‌లో పడ్డయి. దీంతో పేద, మధ్య తరగతి ఇల్లు గడవడం కష్టంగా మారింది. అన్‌లాక్‌లతో అప్పుడప్పుడే కోలుకుంటున్నారు. ఈ టైమ్‌లోనే భారీ వర్షాలు, వరదలో రాష్ట్ర మొత్తం అతలాకుతలమైంది. లక్షల మంది ఇండ్లు వరదలో మునిగాయి. కొన్ని వందల ఇండ్లు కూలిపోగా, వేలల్లో దెబ్బతిన్నాయి. లక్షల వెహికల్స్ కొట్టుకుపోయాయి. భారీ ఎత్తున నష్టం జరిగింది. ఇంకా అనేక కాలనీలు చీకట్లోనే ఉన్నాయి. దీంతో దసరా జోష్ ఎక్కడా కనిపించడం లేదు.
బస్సుల్లో సగం సీట్లు ఖాళీగానే
కరోనాతో ఈ సారి చాలా రైళ్లు రద్దు చేశారు. కొన్ని స్పెషల్ ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఉన్న వాటిలో రష్ గతం కంటే తక్కువుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కూడా ఎక్కువగా ఉంటలేరు. ఆర్టీసీకి రోజుకు రూ.5 కోట్ల కలెక్షన్ మాత్రమే వస్తోంది. జిల్లాల్లో 52శాతం, సిటీలో 40 శాతం ఆక్యుపెన్సీ రేషియో రికార్డవుతోంది.
తగ్గిన కోనుగోళ్లు
ఏటా పండుగకు బట్టలు, ఎలక్ట్రానిక్, హోంనీడ్స్, వెహికల్స్‌కు మంచి గిరాకీ ఉంటుంది. ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తారు. కరోనాతో నష్టపోయిన తాము దసరాతోనైనా ఊరట పొందాలని వ్యాపారస్తులు ఆశపడ్డారు. కానీ కరోనా, వానలు, వరదలతో మార్కెట్లు కళతప్పాయి. షాపింగ్ మాల్స్‌లో తక్కువ సంఖ్యలో ప్రజలు కనిపిస్తున్నారు. కొంతమంది ఆన్‌లైన్ షాపింగ్‌కు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలోకంటే కొనుగోళ్లు బాగా తగ్గాయి.
For More News..