ట్రాన్స్ ఫర్ స్టేషన్ల బయటే చెత్త డంపింగ్.. ఈ-ఆటోలకు వ్యతిరేకంగా స్వచ్ఛ ఆటో కార్మికుల నిరసన

ట్రాన్స్ ఫర్ స్టేషన్ల బయటే చెత్త డంపింగ్.. ఈ-ఆటోలకు వ్యతిరేకంగా స్వచ్ఛ ఆటో కార్మికుల నిరసన
  •     ఆఫీసర్లు స్పందించకపోతే రెండు రోజుల్లో సమ్మె 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ–వాహనాలు, రాంకీకి వ్యతిరేకంగా నగర వ్యాప్తంగా స్వచ్ఛ ఆటో కార్మికులు ఆదివారం వినూత్న నిరసన తెలిపారు. ఇంటింటా సేకరించిన చెత్తను రాంకీ డంపింగ్ స్టేషన్లలో వేయకుండా బయటే డంప్ చేశారు. ఎలక్ట్రిక్ ఆటోల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, రాంకీతో ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్​చేశారు.

 తమ సమస్యలపై రెండు రోజుల్లోగా అధికారులు స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ స్వచ్చ ఆటో టిప్పర్ అండ్ రిక్షా కార్మికుల యూనియన్ హెచ్చరించింది. 40 ఏండ్లుగా స్వచ్ఛ ఆటో కార్మికులుగా పనిచేస్తున్నామని, తమ పొట్ట కొట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. 

తమను రాంకీ కింద పని చేయించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారని, తమ ఉపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల నిరసన నేపథ్యంలో ట్రాన్స్‌‌‌‌ఫర్ స్టేషన్లలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. హంస రాజు, అర్జున్, సూరన్న, ప్రవీణ్, మహేశ్ తదితరులు 
పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన కార్మికులు

స్వచ్ఛ కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్ అండ్ రిక్షా కార్మికుల యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్  హుస్సేన్ నాయక్ ను కలిశారు. స్వచ్ఛ ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రైవేటీకరణ విధానాలపై జోక్యం చేసుకోవాలని కోరారు. 

బల్క్ గార్బేజ్, ఇంటింటి చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలతో సుమారు 80 వేల మంది కార్మికులు, వారి కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛ కార్మికుల్లో  చాలామంది ఎస్టీలు ఉన్నారని తెలిపారు. ఈ విషయంపై హుస్సేన్ నాయక్ సానుకూలంగా స్పందించారని, కార్మికులకు న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.