ఫిజికల్ క్లాసులు స్టార్టయ్యాక తగ్గిపోతున్న ఆదరణ

ఫిజికల్ క్లాసులు స్టార్టయ్యాక తగ్గిపోతున్న ఆదరణ

హైదరాబాద్, వెలుగు:కరోనా టైం నుంచి ఫుల్​జోష్​ మీద ఉన్న ఈ–లెర్నింగ్ కంపెనీలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. నర్సరీ నుంచి వర్సిటీ స్థాయికి వరకు రెగ్యులర్​ఆన్​లైన్ లైవ్ క్లాసులు, ట్యూషన్లతో హవా కొనసాగించిన సంస్థలు ప్రస్తుతం స్టూడెంట్స్ లేక డీలా పడిపోతున్నాయి. గతేడాది సెప్టెంబర్​లో ఫిజికల్ క్లాసులు మొదలైనప్పటి నుంచి ఈ కంపెనీలకు క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. 

బడా కంపెనీలు టీచింగ్ స్టాఫ్​ని, నాన్​టీచింగ్​స్టాఫ్​ను తగ్గించగా, లాక్​డౌన్ టైంలో ఏర్పడిన స్టార్టప్‌‌లు, యాప్‌‌లు మొత్తానికే మూతబడుతున్నాయి. గతంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు స్పెషల్​గా యాప్​లను డెవలప్ చేయించుకుని వాడాయి. ప్రస్తుతం పరిస్థితులు నార్మల్​అవడంతో కొద్దినెలలుగా మేనేజ్​మెంట్లు యాప్​లను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఆయా ​సంస్థల్లో పనిచేసిన ఎంప్లాయ్స్​ వేరే జాబ్స్ ​వెతుక్కుంటున్నారు.

రెండేళ్లలోనే..

వరుస లాక్​డౌన్​లతో విద్యా సంస్థలు తాత్కాలికంగా మూతబడడంతో ప్రత్యామ్నాయంగా అంతా ఈ–లెర్నింగ్ వైపు మళ్లారు. మొదట్లో ఆన్​లైన్​చదువు కష్టమైంది. కానీ పరిస్థితులకు అనుగుణంగా అలవాటు పడుతూ వచ్చారు. దీంతో రెండేళ్లలో ఆన్​లైన్​ఎడ్యుకేషన్ సంస్థల హవా పెరుగుతూ వచ్చింది. బైజూస్, వేదాంత్, అన్‌‌అకాడమీ వంటి ఎన్నో బడా ఈ–లెర్నింగ్ సంస్థలు పరిధిని పెంచాయి. స్టూడెంట్ల సంఖ్యను బట్టి సిబ్బందిని నియమించుకున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి స్టూడెంట్ల డేటా సేకరించేందుకు మార్కెటింగ్ సిబ్బందిని కూడా తీసుకున్నాయి. వీటితోపాటు సిటీ వ్యాప్తంగా చిన్న, పెద్ద స్టార్టప్‌‌లు, యాప్‌‌లు, వెబ్ సైట్లు వేల సంఖ్యలో పుట్టుకొచ్చాయి.ప్రైవేట్ టీచర్లకు ఆన్​లైన్ ​లెర్నింగ్​తో డిమాండ్ పెరిగింది. వారితో ఆయా సంస్థలు వన్ టు వన్ క్లాసులు, లైవ్ క్లాసులు చెప్పించారు. అలా బడా కంపెనీలకు కోట్లలోనే లాభాలొచ్చాయి. స్టార్టప్‌‌లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

పరిస్థితులు తారుమారు

స్కూళ్లు, కాలేజీలు సార్ట్​ అయ్యాక పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు వేలమంది విద్యార్థులు జాయిన్ అయిన సంస్థల్లో ఇప్పుడు వందల్లో కూడా కనిపించడంలేదు. ఆన్​లైన్​లెర్నింగ్ ప్లాట్ ఫామ్‌‌లకు అడ్మిషన్లు రావట్లేదు. నష్టాల్లో పడిపోయిన సంస్థలు టీచర్లను మెల్లిమెల్లిగా తొలగిస్తు న్నాయి. కొన్ని స్టార్టప్‌‌లు  చెప్పాపెట్టకుండా రాత్రికి రాత్రే మూతబడుతున్నాయి. యాప్‌‌లు తయా రుచేసిన వాళ్లు కూడా యూజర్లు లేకపోవడంతో సంస్థలను క్లోజ్ చేస్తున్నారు. ఇలా మొన్నటివరకు అధికంగా ఆదరణ పొందిన ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థలు ఇప్పుడు మూతపడుతున్నాయి.ఆయా సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయిన  టీచర్లు మళ్లీ స్కూళ్లలో జాబ్​ కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు ట్యూటర్లుగా మారుతున్నారు. ఇంకొందరు చిరువ్యాపారాలు చేసుకోవడం, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడం వంటివి చేస్తున్నారు. ఈ–లెర్నింగ్ సంస్థల ద్వారా సిటీలో దాదాపు 5వేల నుంచి 10వేల మంది టీచర్లు ఉపాధి పొందారని ఇప్పుడు వారంతా వేరే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం అధ్యక్షుడు షబ్బీర్ అలీ తెలిపారు. 

ప్రత్యామ్నాయం మాత్రమే

కరోనా టైంలో ఆన్​లైన్​ఎడ్యుకేషన్​ని ఎంచుకోవడం అప్పటి పరిస్థితులకు ప్రత్యామ్నాయం మాత్రమే. అప్పుడే ఈ–లెర్నింగ్ ప్లాట్ ఫామ్స్ ఉన్నాయని అందరికీ తెలిసింది. స్కూళ్లు రీఓపెన్ చేశాక వీటి అవసరం ఉండదు. ఇప్పుడు అదే జరుగుతోంది. పేరెంట్స్​కు ఆన్​లైన్‌‌, ఆఫ్​లైన్ ఎడ్యుకేషన్ మధ్య తేడా తెలియడంతో లాభ, నష్టాలు అర్థమయ్యాయి. ఫిజికల్​క్లాసులే మంచిదని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ–లెర్నింగ్ యాప్స్​వాడే స్టూడెంట్స్​చాలా వరకు తగ్గిపోయారు. కేవలం ట్యూషన్లు, డౌట్స్ కోసమే ఉపయోగిస్తున్నారు. ఆన్ లైన్​కు క్రేజ్​తగ్గిపోవడంతో ప్రస్తుతం ఈ– సంస్థలు ఆఫ్​లైన్​లోకి మారుతున్నాయి. 
- వంశీధర్, కో-ఫౌండర్, రైజ్ ఈ-లెర్నింగ్ యాప్‌‌

ఎవరూ వాడకపోవడంతో క్లోజ్​ చేసినం

గతేడాది అడాడ్ సొల్యూషన్స్ పేరుతో ఎడ్యుకేషన్ యాప్ క్రియేట్ చేశాం. 350 నుంచి 400 మంది టీచర్లతో సీబీఎస్‌‌సీ, స్టేట్ బోర్డు సిలబస్ రికార్డ్ చేయించుకుని పూర్తిస్థాయిలో యాప్ రన్​చేశాం. 10 వేలకు పైగా సబ్‌‌స్క్రైబ్​ చేసుకు న్నారు.10,500 స్కూళ్లు, కాలేజీలు యాప్​ని కొనుగోలు చేశాయి. కాగా డిసెంబర్ నుంచి సబ్‌‌ స్క్రైబర్లు తగ్గిపోగా, ఉన్నవాళ్లు కూడా వాడట్లేదు. చేసేది లేక సంస్థను క్లోజ్ ​చేశారు.
- నాగార్జున, యాప్ డెవలప్పర్, అడాడ్ సొల్యూషన్స్

5 నెలల జీతం ఇయ్యలే..

నేను తెలుగు టీచర్​ని. కరోనా టైంలో జాబ్​పోవడంతో ఈ–లెర్నింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. 25 వేల జీతం ఇస్తామన్నారు. దాదాపు 9 నెలలు వర్క్ చేయించుకున్నారు. మొదటి 2 నెలలు జీతం మంచిగానే ఇచ్చారు. తర్వాత సాకులు చెప్తూ దాటవేశారు. చివరికి చెప్పా పెట్టకుండా కంపెనీని ఎత్తేశారు. ఐదు నెలల జీతం రావాల్సి ఉంది. 
- ప్రవీణ్​రావు, టీచర్‌‌‌‌, కూకట్​పల్లి