ఏపీలో అత్యవసర ప్రయాణికులకు ఇ-పాస్

ఏపీలో అత్యవసర ప్రయాణికులకు ఇ-పాస్
  • డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
  • కర్ఫ్యూ ఉల్లంఘనలు జరిగితే ఫోన్ చేయాల్సిన నెంబర్లు: 100, 112

అమరావతి: ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు రోజు రోజుకూ కఠినతరం చేస్తున్నారు. కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో ఆంక్షలు తీవ్రతరం అవుతున్నాయి. చాలా చోట్ల కర్ఫ్యూను ప్రజలు లైట్ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖకు ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు జప్తు చేస్తే మళ్లీ బయటకు వచ్చేందుకు బ్రేక్ పడుతుందని ఈ దిశలో చర్యలకు ఆదేశాలిచ్చారు. 
అంతర్ రాష్ట్ర రాకపోకలు.. ప్రయాణికులపై ప్రభుత్వమే నిర్ణయం: డీజీపీ
అంతర్ ర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ షరతులు కొనసాగుతాయన్నారు. అయితే అత్యవసర ప్రయాణికుల కోసం రేపటి నుంచి ఇ-పాస్‌ విధానం అమలు చేయనున్నామని ఆయన చెప్పారు. ఇ-పాస్‌ కావాల్సిన వారు పోలీస్‌ సేవ అప్లికేషన్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదని. శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఎక్కడైనా.. ఎవరైనా సరే తారతమ్య భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు.
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే సమాచారం ఇవ్వండి
ఎక్కడైనా కర్ఫ్యూ  ఉల్లంఘనలు జరుగుతుంటే వెంటనే  డయల్‌ 100 లేదా 112  నెంబర్లకు ఫోన్ చేసి  సమాచారం అందించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ఏపీలో కరోనా కేసులు విజృంభణలో సర్కారు పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్నదని, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటున్నాయన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లకు అనుమతిస్తున్నామని.. ఈ నెల 18 వరకు కర్ఫ్యూను అమలులో ఉంటుందని.. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీజీపీ కోరారు.