బ్యాగులో రూ. 25లక్షలు.. పోలీసులకు ఇచ్చేసిన ఆటో డ్రైవర్

బ్యాగులో రూ. 25లక్షలు.. పోలీసులకు ఇచ్చేసిన ఆటో డ్రైవర్

ఈ రోజుల్లో రోడ్డుపై రూపాయి కనపడినా ఎవరూ చూడకుండా జేబులో వేసుకొనే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఓ వ్యక్తికి రూ.25 లక్షలు దొరికినా నిజాయితీతో ఆ నగదును పోలీసులకు అప్పజెప్పాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయాజ్ మహమ్మద్ అనే ఆటో రిక్షా డ్రైవర్ రోజూలాగానే తన ఆటోను తీసుకొని రోడ్డు మీదకు వెళ్లారు. మోదీనగర్‌ లో ప్రయాణికుల కోసం వేచి చూస్తుండగా.. రోడ్డు పక్కన ఓ బ్యాగ్ కనపడింది. చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడం, ఎవరిని అడిగినా తమది కాదని చెప్పారు. తీరా దాన్ని ఓపెన్ చేసి చూడగా రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి. లెక్కపెట్టి చూడగా రూ.25లక్షలు ఉన్నట్లు తేలింది. 

బ్యాగులో అన్ని లక్షలు కనిపించినా ఆటో డ్రైవర్ అయాజ్ కన్ను చెదరలేదు. ఆ బ్యాగు తీసుకుని నేరుగా స్టేషన్ కు పోలీసులకు అప్పజెప్పాడు. నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఆ డ్రైవర్ ను రూరల్ డీసీపీ అభినందించారు. అయాజ్ నిజాయితీని మెచ్చుకుంటూ కమిషనర్ కార్యాలయం ట్వీట్ చేసింది. ఆయనకు డీసీపీ ఫ్లవర్ బొకే, సర్టిఫికేట్ అందిస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది. 

తాను ఆ బ్యాగును చూసినపుడు ఎవరో బాంబు పెట్టి ఉంటారని అనుకున్నానని కానీ తెరిచి చూస్తే అందులో నగదు ఉందని అయాజ్ చెప్పాడు. దాని యజమానిని వెతికే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించానని చెప్పాడు. పేద కుటుంబానికి చెందిన తనకు డబ్బు విలువ, దాన్ని కోల్పోయిన వారి బాధ తనకు తెలుసని అన్నాడు.