- 8 మంది నిందితుల ఆస్తులపై సఫెమా యాక్ట్
- రూ.33 కోట్లు విలువైన ఆస్తులు జప్తుచేసిన ఈగల్ ఫోర్స్
హైదరాబాద్, వెలుగు: ఆల్ఫ్రాజోలం కల్తీ కల్లు కేసులో ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) ఫోర్స్ నిందితుల ఆస్తులు జప్తు చేస్తున్నది. డ్రగ్స్, గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలు విక్రయించే ముఠాలపై సఫేమా (స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మానిప్యులేటర్స్ ఫర్‌ఫిట్యురే ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్)ను ప్రయోగిస్తున్నది. ఇందులో భాగంగా మత్తుపదార్థాల విక్రయంతో అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను జప్తు చేయడం ద్వారా వారి ఆర్థిక మూలా లపై దెబ్బకొడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన ఆల్ఫ్రాజోలం కేసులో చిక్కిన ఆరుగురు నిందితులకు చెందిన రూ.33 కోట్ల విలువైన ఆస్తులను సఫేమా చట్టం కింద జప్తు చేసింది. ఈ మేరకు ఈగల్ ఫోర్స్ అధికారులు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశా రు. కల్లులో మత్తుకోసం కలుపుతున్న ఆల్ఫ్రాజోలం కారణంగా సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మ ల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, గద్వాల్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గతంలో 11 మంది మృతిచెందారు. ఆల్ఫ్రాజోలం అమ్మి కూడబెట్టిన అక్రమ సంపాదనతో కల్లులో ఆల్ఫ్రాజోలం కల్తీపై ఈగల్ ఫోర్స్ అధికారులు సమ గ్ర దర్యాప్తు జరిపారు. గుమ్మడిదల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ప్రధాన నిందితుడు గిర్మగౌని సుధీర్ గౌడ్ సహా మొత్తం 20 మందిని గతంలో అరె స్టు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ ముఠాలోని కీలక వ్యక్తుల ఆస్తులను గుర్తించారు. ఆల్ఫ్రాజోలం అమ్మి కూడబెట్టిన అక్రమ సంపాదనకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఇందులో సుధీర్‌గౌడ్, బిశ్వేశ్వర సింగ్, రాజేశ్వర శర్మ జోషి, గిర్మగౌని శ్రీవాని, భావనగారి ప్రభువర గౌడ్, ఎన్ విశాల్ గౌడ్, సాయికుమార్ గౌడ్, గజ్జెల శ్రీశైలం గౌడ్‌కు చెందిన ఆస్తులను గుర్తించారు. ఆల్ఫ్రాజోలం విక్రయాలతోనే ఖరీదైన కార్లు కొనుగోలు చేయడంతో పాటు బ్యాంకు బ్యాలెన్స్‌లు పెంచుకున్నట్లు నిర్ధారించారు. ఈ మొత్తం ఆధారాలతో చెన్నైలోని సఫేమా అధికారులకు అందించారు. ఈ మేరకు సఫేమా అధికారులు ఆయా ఆస్తులను జప్తు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రూ.33 కోట్లు విలువ చేసే ఆస్తులను జప్తు చేశారు. ఈ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో డిపాజిట్ చేయనున్నారు.
