- కొకైన్, హెరాయిన్‌తో పాటు సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం
- నెల రోజుల పాటు గాలింపు
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ డ్రగ్ సప్లయర్లపై తెలంగాణ ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) నిఘా పెంచింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను కట్టడి చేసేందుకు స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించింది. ఢిల్లీలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి జాయింట్ ఆపరేషన్ చేసింది. వీసా గడువు ముగిసినా అక్రమంగా దేశంలో నివసిస్తూ.. కొకైన్, హెరాయిన్ సహా నిషేధిత సింథటిక్ డ్రగ్స్ సప్లై చేస్తున్న 50 మంది నైజీరియన్లను అరెస్టు చేసింది. కీలకమైన ఆపరేషన్ ను ఈగల్ టీమ్ చీఫ్ సందీప్ శాండిల్య స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షించారు. ఆయన నేతృత్వంలో ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నంలో ఏకకాలంలో దాడులు చేశారు.
జాయింట్ ఆపరేషన్ వివరాలను ఈగల్ డైరెక్టర్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న నైజీరియన్లు, ఇతర డ్రగ్స్ పెడ్లర్లను ఈగల్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న డీలర్లు, ప్రధాన పెడ్లర్ల కోసం పోలీసులు గాలించారు. ఢిల్లీ, ముంబైలో కీలక ఆధారాలు సేకరించారు. ఢిల్లీలోని మెహ్రౌలి, సంత్ నగర్, ప్రతాప్ ఎన్‌క్లేవ్, పృథ్వీ పార్క్, నీలోతి, చంద్రనగర్, మునిర్కా సహా పలు ప్రాంతాల్లో నైజీరియన్ల డ్రగ్స్ దందాను గుర్తించింది. దాదాపు నెల రోజులుగా డెకాయ్ ఆపరేషన్ చేసింది. పక్కా సమాచారంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో కలిసి 20 ప్రదేశాలలో సోదాలు చేసి 50 మంది నైజీరియన్లను అరెస్టు చేశారు. వీరితో పాటు సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్న డ్రగ్ సేల్ గర్ల్స్, మ్యూల్ ఖాతాదారులను కూడా అరెస్టు చేశారు. ఢిల్లీతో పాటు విశాఖపట్నంలోనూ ఆపరేషన్ ఏకకాలంలో జరిగింది. కొకైన్, హెరాయిన్ సహా వివిధ రకాల సింథటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ట్రాన్సిట్ వారంట్ పై హైదరాబాద్ కు తరలించనున్నారు.
