కరోనా కట్టడి కోసం సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతున్న కొన్నిచోట్ల జనాలు అస్సలు పట్టించుకోవడంలేదు. లాక్ డౌన్ క్రమంలో మద్యం బంద్ పెట్టడంతో.. కల్లు కాంపౌండ్ వ్యాపారులు దొంగచాటు దందా నడిపిస్తున్నారు. దీంతో కల్లు ప్రియులు సామాజిక దూరాన్ని పాటించకుండా కల్లు కోసం ఎగబడుతున్నారు. రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ కి కూతవేటు దూరంలో ఉన్న నాగులపల్లి గ్రామంలో తెల్లవారుజామున ఐదు గంటలకే మందు కల్లు విక్రయాలు జరుపుతున్నారు. దీంతో గంటలో వందలాది మంది గుంపులు గుంపులుగా కాంపౌండ్ దగ్గరకు చేరుకుంటున్నారు. భయం లేకుండా సామాజిక దూరం పాటించకుండా కల్లు కోసం ఎగబడుతున్నారు.
షాద్ నగర్, ఫరూక్ నగర్, ఇతర గ్రామాల ప్రజలు ఇక్కడకు చేరుకుంటున్నారు. కల్లు అయిపోతుందో ఏమో అన్న ఆత్రుతతో జనాలు కల్లు కాంపౌండ్ గోడలు దూకి మరి లోపలికి ప్రవేశిస్తున్నారు. రోజు ఇదే తంతుతో ఉదయాన్నే కాంపౌండ్ వద్ద హడావిడి కనిపిస్తుంది. ప్రభుత్వం సామాజిక దూరాన్ని పాటించాలని మద్యాన్ని, మందు కల్లును మూసివేయిస్తే వ్యాపారులు ఇలా తుంగలో తొక్కుతున్నారని స్థానికులు సీరియస్ అవుతున్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రయత్నాలు చేస్తుంటే కల్లు వ్యాపారులు మాత్రం దొంగచాటుగా ఈ దందాకు తెగబడుతున్నారని తెలిపారు. ఎక్సైజ్ శాఖ పట్టించుకుని ఈ దందాను మూసేయాలని కోరుతున్నారు స్థానికులు.
