సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట: జనవరి 19కి జన నాయగన్ మూవీ నిర్మాత పిటిషన్ వాయిదా

సుప్రీంకోర్టులోనూ దక్కని ఊరట: జనవరి 19కి జన నాయగన్ మూవీ నిర్మాత పిటిషన్ వాయిదా

న్యూఢిల్లీ: సౌత్ స్టార్ హీరో, టీవీకే చీఫ్ విజయ్ లేటేస్ట్ చిత్రం జన నాయగన్‎కు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ జన నాయగన్ చిత్ర నిర్మాత దాఖలు చేసిన పిటిషన్‌పై 2026, జనవరి 19న విచారణ జరగనుంది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు తిరస్కరించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. దీంతో జనవరి 19 వరకు జన నాయగన్ మూవీ విడుదలకు పూర్తిగా దారులు మూసుకుపోయాయి. 

వివాదం ఏంటంటే..?

దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్. సంక్రాంతి పండగను పురస్కరించుకుని 2026, జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. పాలిటిక్స్‎లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఇదే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో జన నాయగన్ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలో జన నాయగన్ సినిమాపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సెన్సార్ సర్టిఫికెట్‌ జారీ చేయలేదు.

దీంతో జనవరి 9న విడుదల కావాల్సిన జన నాయగన్ విడుదల వాయిదా పడింది. సీబీఎఫ్‎సీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ మూవీ నిర్మాత మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సీబీఎఫ్‎సీని ఆదేశించింది. అయితే..  సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు హైకోర్టు డివిజన్ బెంచ్‌‎లో ఛాలెంజ్ చేసింది.

జన నాయగన్ మూవీకి U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అనంతరం ఈ కేసు విచారణను 2026, జనవరి 21కి వాయిదా వేసింది. ఈ క్రమంలో డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ జన నాయగన్ మూవీ నిర్మాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎ను అత్యవసరంగా విచారించేందుకు తిరస్కరించిన సుప్రీంకోర్టు 2026, జనవరి 19న విచారిస్తామని తెలిపింది. చివరాఖరి ప్రయత్నం కూడా విఫలం కావడంతో విజయ్ జన నాయగన్ మూవీ పొంగల్ రేసు నుంచి ఔట్ అయ్యింది.