టెహ్రాన్: ఇరాన్లో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ప్రస్తుతం ఆ దేశంలో ఎక్కడ చూసిన జనం రోడ్లపై ఆందోళనలు చేస్తోన్న దృశ్యాలే కనిపిస్తోన్నాయి. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడం మరోవైపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నియంత పాలనతో విసిగిపోయిన ఇరాన్ ప్రజలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రెండు వారాల నుంచి కొనసాగుతోన్న ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.
మొదటి రాజధాని నగరం టెహ్రాన్‌లో మొదలైన నిరసన జ్వాలలు రోజుల వ్యవధిలోనే దేశమంతటా విస్తరించాయి. మరోవైపు నిరసనకారులను ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణివేస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్ అల్లర్లలో 2 వేల మందికి పైగా చనిపోయినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. అనధికారికంగా ఈ లెక్క ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుందని ఆ దేశ మీడియా పేర్కొంది. ఇరాన్ అల్లర్లలో 12 వేల మంది చనిపోయారని ఆ దేశ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. నిరసనకారులపై ఖమేనీ ప్రభుత్వం బల ప్రయోగం చేస్తుండటంతో అమెరికా ఏ క్షణానైనా టెహ్రాన్‌పై దాడి చేసే అవకాశం ఉంది.
ఇరాన్లో రోజురోజుకు పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీ భారత పౌరులకు కీలక సూచన చేసింది. ఇరాన్లో పెరుగుతున్న అస్థిరత నేపథ్యంలో అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని సూచించింది. వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని స్టూడెంట్స్, టూరిస్టులు, వ్యాపారవేత్తలను కోరింది. వెళ్లే పరిస్థితి లేని వారు జాగ్రత్తగా ఉండాలని.. ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఏదైనా సమస్య ఉంటే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పింది. ప్రయాణ, గుర్తింపు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోని వారు వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పింది. సహాయం కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు, ఇమెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించింది.
