ఇరాన్ అమానుషం: శవం ఇవ్వాలంటే రూ.3 లక్షలు కట్టాల్సిందే.. బుల్లెట్ ఫీజు అంటే ఏంటి..?

ఇరాన్ అమానుషం: శవం ఇవ్వాలంటే రూ.3 లక్షలు కట్టాల్సిందే.. బుల్లెట్ ఫీజు అంటే ఏంటి..?

ఇరాన్‌లో నిరసన జ్వాలలు ఆరడం లేదు. ఈ క్రమంలో నినదిస్తున్న ప్రజలపై ఆ దేశ ప్రభుత్వం అనుసరిస్తున్న అమానుష విధానాలు ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలపై జరిగిన భయంకరమైన అణచివేతలో మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 2వేల 500 దాటిందని అంచనా. అయితే ఈ విషాదంలో కూడా ఇరాన్ పాలకులు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాల నుండి కూడా డబ్బు వసూలు చేస్తూ.. శవాల మీద చిల్లర ఏరుకునే చందంగా వ్యవహరిస్తున్నారు. దీనిని నిరసనకారులు "బుల్లెట్ ఫీజు" అని పిలుస్తున్నారు.

ఏంటీ బుల్లెట్ ఫీజు..?
ఇరాన్ నిరసనల్లో మరణించిన వారి మృతదేహాలను తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించాలంటే.. అక్కడి అధికారులు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 500 మిలియన్ టోమన్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 3 లక్షలు చెల్లిస్తేనే శవాలను అప్పగిస్తామని రూల్ పెట్టారు. తమ వారిని కాల్చి చంపిన బుల్లెట్ల ఖర్చును కూడా బాధిత కుటుంబాల నుంచే ఖమేనీ సర్కార్ వసూలు చేస్తుండటం ఆ దేశంలో నెలకొన్న కర్కశత్వానికి నిదర్శనంగా మారింది.

టెహ్రాన్‌కు చెందిన ఒక మహిళ తన స్నేహితుడికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఈ క్రూరత్వాన్ని వెలుగులోకి తెచ్చింది. ఒక నిరసనలో పాల్గొన్న సదరు వ్యక్తి, తన భార్యపైకి వస్తున్న గ్రీన్ లేజర్ లైట్‌ను గమనించాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆమెకు అడ్డుగా దూకాడు. దురదృష్టవశాత్తు, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ నేరుగా అతని ముఖంలోకి దూసుకుపోయింది. అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు.

కళ్లముందే కాల్చి చంపినప్పటికీ.. అధికారిక రికార్డుల్లో మాత్రం అధికారులు పదునైన వస్తువు తగలడం వల్ల గాయం వల్ల మరణించినట్లు రిపోర్టు ఇచ్చారు. ఆపై మృతదేహాన్ని అప్పగించడానికి రూ.3 లక్షల 'బుల్లెట్ ఫీజు' డిమాండ్ చేశారు. గత్యంతరం లేక ఆ కుటుంబం ఆ డబ్బు చెల్లించి.. నిశ్శబ్దంగా అంత్యక్రియలు నిర్వహించారు. డబ్బు వసూలు చేసినా.. కనీసం మరణానికి అసలు కారణాన్ని కూడా రిపోర్టులో మార్చకపోవడం ఆ కుటుంబానికి మరింత మానసిక క్షోభకు గురిచేసింది. కుటుంబ సభ్యులు మరణించిన బాధలో ఉన్న ఫ్యామిలీల నుంచి డబ్బు డిమాండ్ చేయటం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. 

ఇలాంటి అమానుష చర్యలే ఇరాన్ పాలకుల పతనానికి నాంది పలుకుతాయని అక్కడి ప్రజలు అంటున్నారు. పోలీసుల లాఠీఛార్జులు, టియర్ గ్యాస్ ప్రయోగాలు ఉన్నప్పటికీ.. గర్భిణీలు, వృద్ధులు, చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకు వస్తున్నారు. కేవలం ఆర్థిక ఇబ్బందులే కాకుండా, ఆత్మగౌరవం కోసం, న్యాయం కోసం తరం తారతమ్యం లేకుండా ప్రజలు భుజం భుజం కలిపి పోరాడుతున్నారు. నిరసనకారుల ప్రధాన నినాదం ఇప్పుడు ఒక్కటే.. అదే "ప్రభుత్వ మార్పు". ఎలాగైనా ఖమేనీ నియంతృత్వ కోరల్లో నుంచి స్వేచ్ఛ కావాలని వారు చేస్తున్న డిమాండ్లకు అగ్రరాజ్యం అమెరికా కూడా అండగా నిలుస్తోంది.