వాషింగ్టన్: అంతా మీ ఇష్టం అనుకుంటున్నారా ఏంటీ.. మీరు అతడిని ఉరి తీస్తే.. ఆ తర్వాత నేను మీ అంతు చూస్తాను.. వదిలే ప్రసక్తే లేదు.. ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎవరికి అంటే ఇరాన్ దేశానికి.. ఇప్పుడు ఇరాన్ దేశాన్ని పాలిస్తున్న ఖమేనీకి.. అవును.. 20 రోజులుగా ఇరాన్ దేశంలో ప్రజా ఉద్యమం నడుస్తుంది.. ఈ ఉద్యమంలో కీలకంగా ఉన్న 26 ఏళ్ల నిరసనకారుడు ఎర్ఫాన్ సోల్తానీని ఉరి తీయాలని ఇరాన్ ఖమేనీ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ విషయం తెలిసిన ట్రంప్.. మాస్ వార్నింగ్ కాదు.. ఏకంగా అల్టిమేటం ఇచ్చాడు.. ఈ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న 26 ఏళ్ల యువకుడు ఎర్ఫాన్ సోల్తానీని ఉరి తీసేందుకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. 2026, జనవరి 14న ఎర్ఫాన్ను ఉరి తీయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేసిన యువకుడికి ఎలాంటి విచారణ లేకుండా ఏకపక్షంగా ఉరి విధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు.
శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న నిరసనకారులను ఉరితీయవద్దని హెచ్చరించాడు. నిరసనకారుల పట్ల ప్రభుత్వం మానవత్వం చూపించాలని.. వాళ్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆందోళనకారులను చంపబోరని ఆశిస్తున్నానని.. ఒకవేళ ఖమేనీ ప్రభుత్వం నిరసనకారులను ఉరి తీయడం ప్రారంభిస్తే అమెరికా చాలా కఠినమైన చర్య తీసుకుంటుందని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే అమెరికా నుంచి సహయం అందుతుందని నిరసనకారులకు భరోసా ఇచ్చారు.
ఎవరీ ఎర్ఫాన్ సోల్తానీ..?
టెహ్రాన్ శివారులోని కరాజ్ నివాసి అయిన ఎర్ఫాన్ సోల్తానీని జనవరి 8న ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నాడన్న కారణంతో అతడిని అరెస్ట్ చేశారు. కనీస మానవ హక్కులు కూడా లేకుండా నిర్బంధించి, నిరసనలు అణచివేయడానికి అతడికి ఉరిశిక్ష విధించింది. అరెస్ట్ చేసిన మూడు రోజుల వ్యవధిలోనే అతడికి మరణ శిక్ష విధించారు. ఎర్ఫాన్ సోల్తానీ మరణ శిక్షపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎటువంటి విచారణ లేకుండా కనీసం న్యాయవాదిని కూడా కలవనివ్వకుండా మరణశిక్ష విధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ద్రవ్యోల్బణం, కరెన్సీ రేట్ పడిపోవడం, ఖమేనీ నియంత పాలనతో విసిగిపోవడం వంటి కారణాలతో 2025 డిసెంబర్ చివరి వారంలో ఇరాన్ లో ప్రజా ఉద్యమం మొదలైంది. నిరసనలను ఖమేనీ సర్కార్ ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఇప్పటివరకు 16వేల 700 మందికి పైగా అరెస్టయ్యారు. 2 వేల మంది చనిపోయినట్లు అఫిషియల్ గా ప్రకటించారు అధికారులు.. కానీ ఈ లెక్క ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
