
తొగుట(రాయపోల్), వెలుగు : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో సర్కారు తోటగా పిలవబడుతున్న 10 ఎకరాల భూమిని సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులను బుధవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. రికార్డులు మాయం చేసి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాజేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సర్కారు తోటను గ్రామానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. రాయపోల్‌లోని సర్వేనంబర్720లో ప్రభుత్వానికి చెందిన10 ఎకరాల భూమి ఉండేదని, అధికారులు, కొందరు నాయకులు కుమ్మక్కై ఓ వ్యక్తి పేరు మీదికి మార్చారని చెప్పారు.
అతని నుంచి మరో వ్యక్తి పేరు మీదికి మార్చి రికార్డులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అయితే సర్వే నేపథ్యంలో రాయపోల్గ్రామస్తులను కొందరిని బుధవారం వేకువజామున 3 గంటలకే అరెస్ట్‌చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. గొడవలు తలెత్తకుండా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. అయినప్పటికీ గ్రామస్తులు సర్వేను అడ్డుకున్నారు.
ఆర్డీఓ బన్సిలాల్ మాట్లాడుతూ గ్రామస్తుల వద్ద ఆధారాలు వుంటే మూడు రోజుల్లోగా తమకు అందజేయాలని, లేకుంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకోవాలని సూచించారు. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి తెలిపారు. 10 రోజులు సమయం ఇవ్వాలని గ్రామస్తులు ఆర్డీఓను కోరారు.