హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

హైదరాబాద్లో ఐటీ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచన చేసింది. బుధవారం (ఆగస్ట్ 13) హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో.. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ చేసుకునే వెసులుబాటు కల్పించాలని కంపెనీలకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వర్షం ఓ మోస్తరుగా కురిస్తేనే హైదరాబాద్ ఐటీ కారిడార్ ఏరియా చెరువును తలపిస్తున్న పరిస్థితులున్నాయి.

ట్రాఫిక్లో గంటల కొద్దీ వర్షంలో తడుచుకుంటూ ఉద్యోగులు నానా తిప్పలు పడి ఇళ్లకు చేరుకుంటున్నారు. రోడ్లన్నీ జలమయం అవుతుండటంతో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందోనని బిక్కుబిక్కుమంటూ ఇళ్ల నుంచి ఆఫీస్లకు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళుతున్నారు. పైగా.. ఉద్యోగులు ఇళ్లకు బయల్దేరి వెళ్లే సాయంత్రం వేళలో వర్షం కుండపోతగా కురుస్తుండటంతో ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం.

ఆగస్టు 12, 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పోలీసు శాఖ సూచించింది. ముఖ్యంగా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో నిదానంగా వెళ్లాలని సూచన చేసింది. #weatherforecast ఫాలో అవుతూ పనులను షెడ్యూల్ చేసుకోవడం మంచిదని తెలంగాణ పోలీస్ శాఖ హైదరాబాద్ నగర ప్రజలకు సలహా ఇచ్చింది. అంతేకాదు.. ‘ఎక్స్’ వేదికగా కొన్ని కీలక సూచనలు కూడా చేసింది.

Also Read:-హైదరాబాద్ సిటీలో ఈ ఏరియా వాళ్లకు ఈ రాత్రి దబిడి దిబిడే: కుండపోత వర్షం అంటూ GHMC అలర్ట్


హైదరాబాద్లో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అవరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రజలకు సూచించారు. ఎంతటి వానలు పడినా జీహెచ్ఎంసీ అన్ని విధాలా సిద్ధంగా ఉందని, హైడ్రా, జలమండలి, వాటర్ బోర్డులతో కలిసి పని చేస్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదైందన్నారు.

కృష్ణా నగర్లో వరద వచ్చే ప్రాంతంలో ఇప్పటికే పనులు ప్రారంభించామని, మైత్రీవనం వద్ద వరద ప్రభావం లేకుండా సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. సాయంత్రం సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుండడంతో ఐటీ కంపెనీలు లాగౌట్ టైమింగ్స్ చేంజ్​చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు.