
మాస్కో: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.0గా నమోదు అయ్యిందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. బుధవారం (జూలై 30) ఉదయం 8:25 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. భూ కంప నేపథ్యంలో రష్యాకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతావరణ సంస్థ. యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.7గా నమోదైందని తెలిపింది.
19.3 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. రష్యాతో పాటు జపాన్, హవాయి, అలస్కా తీర ప్రాంతాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. తీర ప్రాంతంలో అలలు నాలుగు మీటర్ల మేర ఎగసిపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. హవాయి, అలస్కా తీర ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సునామీ హెచ్చరికలు ఎత్తేసే వరకు తీర ప్రాంతాలకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు. కమ్చట్కాలో భారీ భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు రష్యా వెల్లడించింది.