ఈ పండ్లు తాగేయొచ్చు

ఈ పండ్లు తాగేయొచ్చు

ఈ ఫ్రూట్‌‌ జ్యూస్‌‌ సెంటర్‌‌‌‌లో జ్యూస్‌‌ను ఫ్రూట్‌‌లోనే పోసిస్తారు. ఫ్రూట్‌‌లో జ్యూస్‌‌ పోసివ్వడమేంటి? అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి.

    కర్నాటకలోని బెంగుళూరులో మల్లేశ్వరం ఏరియా సంపిగె రోడ్‌‌లో ఒక జ్యూస్‌‌ సెంటర్‌‌‌‌ ఉంది. దాని పేరు ‘ఈట్‌‌ రాజా’. అందులోకి వెళ్లి కావాల్సిన జ్యూస్‌‌ ఆర్డర్‌‌‌‌ ఇవ్వగానే ఆ ఫ్రూటే చేతిలో పెడతారు. కాకపోతే.. అందులో గుజ్జుకు బదులు జ్యూస్‌‌ ఉంటుంది. అదే ‘ఈట్‌‌రాజా’ స్పెషల్‌‌. ఏ జ్యూస్‌‌ కావాలన్నా  ఆ ఫ్రూట్‌‌ తొక్కలోనే పోసిస్తారు. ఇక్కడ ప్లాస్టిక్‌‌ అస్సలే వాడరు.

ఆనంద్‌‌ రాజ్‌‌.. ఫేమస్‌‌ రేడియో జాకీ. పన్నెండేళ్లుగా అదే ఫీల్డ్‌‌లో ఉన్నాడు. వాళ్ల నాన్న 45ఏళ్లపాటు జ్యూస్‌‌స్టాల్‌‌ నడిపించాడు. రెండేళ్ల క్రితం చనిపోయాడు. దాంతో జ్యూస్‌‌స్టాల్‌‌ బాధ్యతను ఆనంద్‌‌ తీసుకోవలసి వచ్చింది. దాంతో రేడియో జాకీ ఉద్యోగానికి రిజైన్‌‌ చేసి, బిజినెస్‌‌లోకి దిగాడు. కానీ..ఆయనకు తన షాపులో ప్లాస్టిక్‌‌ వాడడం ఇష్టంలేదు. అందుకే జీరో-వేస్ట్‌‌ పాలసీతో షాపు నడిపించి.. తక్కువ టైంలోనే సక్సెస్‌‌ అయ్యాడు. ‘ఈట్‌‌ రాజా’ పేరిట జ్యూస్‌‌ కార్నర్‌‌ పెట్టి ‘దట్‌‌ ఈజ్‌‌ రాజా’ అనిపించుకున్నాడు. ఆయన జ్యూస్‌‌స్టాల్‌‌లో పండ్లలో  గుజ్జు తిసేసి, ఆ డొప్పల్లోనే వాటి జ్యూస్‌‌ పోసిస్తారు. జ్యూస్‌‌ తాగిన తర్వాత కస్టమర్ పారేసిన  డొప్పను కూడా వేస్ట్‌‌గా పోనివ్వడు. వాటిలోని సిట్రస్‌‌ పండ్ల తొక్కలతో బయో ఎంజైమ్స్ తయారుచేస్తాడు. వాటితో ఎకో ఫ్రెండ్లీ క్లీనింగ్‌‌ లిక్విడ్స్‌‌ని తయారుచేస్తున్నాడు. ఆ లిక్విడ్స్‌‌ను ఫ్లోర్స్‌‌ క్లీన్‌‌ చేయడానికి, బట్టలు ఉతకడానికి వాడుతున్నాడు. మిగతా పండ్ల తొక్కలను జంతువులకు ఆహారంగా వేస్తున్నాడు.

ఎందుకొచ్చిందీ ఆలోచన

ఆనంద్‌‌ రేడియో జాకీగా ఉన్నప్పుడు చాలామంది పర్యావరణ వేత్తలను ఇంటర్వ్యూ చేశాడు. వాళ్లు చెప్పిన విషయాలు విని ఇన్‌‌స్పైర్‌‌‌‌ అయ్యాడు. పర్యావరణంపై ప్రేమ పెంచుకున్నాడు. అందుకే వాళ్ల నాన్న జ్యూస్‌‌స్టాల్‌‌ నడిపే టైంలో కూడా ప్లాస్టిక్‌‌ వాడకాన్ని తగ్గించాలని ఎన్నోసార్లు చెప్పాడు. కానీ.. అప్పుడు వాళ్ల నాన్న ‘అదంతా సాధ్యమయ్యే పని కాదు’ అని కొట్టిపారేశాడు. అయితే.. ఆ పనినే ఎంత కష్టమైనా చేయాలి అనుకున్నాడు ఆనంద్‌‌. అందుకే తాను షాపు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జ్యూస్‌‌ కార్నర్‌‌‌‌లో డిస్పోజబుల్‌‌ గ్లాసులు, ప్లాస్టిక్‌‌ స్ట్రాలు, సింగిల్‌‌టైం యూజ్‌‌ ప్లేట్లు, వాటర్‌‌‌‌ బాటిళ్లు, జ్యూస్‌‌ ప్యాక్‌‌ చేసే ప్లాస్టిక్‌‌ కవర్లు వాడడం ఆపేశాడు. ప్లాస్టిక్‌‌ సీసాలు తీసేసి, వాటికి బదులుగా గాజు సీసాలను పెట్టాడు. ప్లాస్టిక్‌‌తో చేసిన స్ట్రాలకు బదులుగా అరటి ఆకులతో, చెక్కతో చేసిన స్ర్టాలను వాడడం మొదలుపెట్టాడు.  గ్లాస్‌‌లకు బదులుగా పండ్ల తొక్కలను వాడుతున్నాడు. దాంతో గ్లాస్‌‌లు కడిగేందుకు వాడే నీటిని ఆదా చేస్తున్నాడు. కొన్ని పండ్ల జ్యూస్‌‌లు మాత్రం గాజు గ్లాసుల్లో ఇస్తున్నాడు. ఈ జ్యూస్‌‌ కార్నర్‌‌‌‌కు వెళ్లగానే ‘మీరు తాగే సిగరెట్‌‌ను మాకివ్వండి. క్యాన్సర్‌‌ని నివారించే పండ్ల రసాన్ని ఉచితంగా తీసుకోండి’ అని రాసి ఉన్న ఒక బోర్డు కనిపిస్తుంది. దీన్ని చూసి చాలామంది టీనేజర్స్ అట్రాక్ట్‌‌ అవుతున్నారు. అంతేకాదు ఇక్కడినుంచి ఎవరైనా జ్యూస్‌‌ పార్సిల్‌‌ తీసుకెళ్లాలంటే.. గాజు సీసాలు, స్టీల్‌‌ బాక్స్‌‌లు వెంట తీసుకెళ్లాలి. ప్లాస్టిక్‌‌ బాటిల్‌‌, ప్యాకింగ్‌‌ కవర్‌‌‌‌ తీసుకెళ్తే  జ్యూస్‌‌  అస్సలు అమ్మరు. ఒకవేళ ఎవరైనా పేషెంట్‌‌కు ఎమర్జెన్సీగా జ్యూస్‌‌ కావాలంటే తన దగ్గరున్న గాజు సీసాలో పోసి ఇస్తాడు. అంతేకానీ.. ప్లాస్టిక్‌‌ బాటిల్‌‌లో మాత్రం పోయడు.

నేచురల్‌‌ లిక్విడ్స్‌‌

కస్టమర్లు జ్యూస్‌‌ తాగి పడేసిన సిట్రస్‌‌ జాతి పండ్ల తొక్కలతో ఆనంద్‌‌ లిక్విడ్‌‌ తయారుచేస్తున్నాడు. ఈ లిక్విడ్‌‌ని మొదట్లో తను మాత్రమే వాడేవాడు. కానీ.. ఇప్పుడు కస్టమర్లకు కూడా అమ్ముతున్నాడు. సాధారణంగా మార్కెట్‌‌లో దొరికే కొన్ని క్లీనింగ్‌‌ కెమికల్స్‌‌ అంత మంచివి కావు. వాటికి బదులుగా ఈ నేచురల్‌‌ ప్రొడక్ట్స్​వాడితే  ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ లిక్విడ్‌‌తో టైల్స్‌‌, టాయిలెట్‌‌, వాష్‌‌ బేసిన్‌‌.. అన్నీ క్లీన్‌‌ చేయొచ్చు. ఇది తెలుసుకున్న చాలామంది ఆనంద్‌‌ పద్ధతులను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆనంద్‌‌ తన జ్యూస్‌‌ కార్నర్‌‌‌‌లో పండ్ల తొక్కలతో నెలకు సుమారు 100 లీటర్ల లిక్విడ్‌‌ను తయారుచేస్తున్నాడు.

వెరైటీ జ్యూస్‌‌

ఈట్‌‌రాజా జ్యూస్‌‌ కార్నర్‌‌‌‌లో దొరికే వెరైటీ జ్యూస్‌‌లకు ఆ ఏరియాలో ఎంతోమంది ఫ్యాన్స్‌‌ ఉన్నారు. ఆనంద్‌‌ జ్యూస్‌‌లో అల్లం రసం, శొంఠి లాంటివి వేసి డిఫరెంట్‌‌గా తయారు చేస్తాడు. ఒక పండు జ్యూస్‌‌లో మరో పండు జ్యూస్‌‌ కలిపి వెరైటీ జ్యూస్‌‌లు తయారు చేసిస్తాడు. యాపిల్‌‌, పనస, డ్రై ఫ్రూట్స్‌‌, వెనిల్లా ఐస్‌‌క్రీమ్‌‌ కలిపి చేసే స్పెషల్‌‌ జ్యూస్‌‌ ఇక్కడ చాలా ఫేమస్‌‌. ఈ జ్యూస్‌‌ స్టాల్‌‌ను చూసి, బెంగళూరులోని చాలా కార్పొరేట్‌‌ ఆఫీసుల్లో ఇలాంటి జ్యూస్‌‌ కార్నర్‌‌‌‌లను ఏర్పాటు చేస్తున్నారు.