తెలంగాణ వచ్చాక తొలి రాజీనామా

తెలంగాణ వచ్చాక తొలి రాజీనామా

తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీని వీడితూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి నాయకుడిగా ఈటల రాజేందర్ నిలిచారు. గడిచిన ఏడేండ్లలో వేర్వేరు పార్టీల నుంచి 41 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించినా ఒక్కరూ రాజీనామా చేయలేదు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌‌, టీడీపీ, బీఎస్పీ, ఫార్వర్డ్‌‌ బ్లాక్‌‌ పార్టీల నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌‌ఎస్‌‌లో చేరినా ఒక్కరూ తమ పదవులు వదులుకోలేదు. రాజ్యాంగంలోని నిబంధనలు అడ్డుపెట్టుకొని లెజిస్లేటివ్‌‌ పార్టీల విలీనం ద్వారా వారు పదవులు కోల్పోకుండా అధికార పార్టీ కాపాడుతూ వస్తోంది.

అపోజిషన్ పార్టీ సభ్యత్వంతో మంత్రి పదవి

తెలంగాణ వచ్చాక జరిగిన తొలి ఎన్నికల్లో ఇంద్రకరణ్‌‌ రెడ్డి, కోనేరు కోనప్ప బీఎస్పీ నుంచి గెలిచారు. ఇద్దరూ టీఆర్‌‌ఎస్‌‌ ఎల్పీలో విలీనం అయ్యారు. ఇంద్రకరణ్‌‌ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. తర్వాత టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన మంత్రి అయిన ఏడాది తర్వాత టీడీపీఎల్పీ టీఆర్‌‌ఎస్‌‌లో విలీనం అయ్యింది. అప్పటి వరకు అసెంబ్లీ రికార్డుల్లో ఆయన పేరు టీడీపీ సభ్యుడిగా ఉండింది. అంటే అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ తలసాని కేబినెట్‌‌లో కొనసాగారు.

ఫస్ట్‌‌ టర్మ్‌‌లో 25 మంది.. సెకండ్ టర్మ్​లో 16 మంది..

2014లో టీడీపీ నుంచి 15 మంది గెలిచారు. కానీ 12 మంది టీఆర్ఎస్​లో చేరారు. సీపీఐ నుంచి ఒకరు, వైసీపీ నుంచి ముగ్గురు టీఆర్‌‌ఎస్‌‌ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలు పలువురు టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా కొనసాగారు. 2014 ఎన్నికల తర్వాత 25 మంది ఎమ్మెల్యేలు సొంత పార్టీని వీడి టీఆర్‌‌ఎస్‌‌లో చేరారు. 2018లో కాంగ్రెస్‌‌ నుంచి 12 మంది, ఇద్దరు టీడీపీ సభ్యులు, ఫార్వర్డ్‌‌ బ్లాక్‌‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌, ఇండిపెండింట్‌‌ ఎమ్మెల్యే రాములు నాయక్‌‌ టీఆర్‌‌ఎస్‌‌లో చేరారు.