అక్రమ సంపాదనను హుజురాబాద్‌లో పంచుతున్నరు

అక్రమ సంపాదనను హుజురాబాద్‌లో పంచుతున్నరు

హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ సహచరులు కనుమరుగయ్యారని.. ఉద్యమ ద్రోహులు పెత్తనం చెలాయిస్తున్నారని బీజేపీ నేత, హుజురాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మానుకోటలో మాపై రాళ్లు వేసిన వ్యక్తికి కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ఆ ఎమ్మెల్సీ 2018లో నన్ను ఓడగొట్టాలనుకున్నాడని ఆయన అన్నారు. పాదయాత్రలో ఉన్నప్పుడు అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ఈటల రాజేందర్.. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఈ రోజు ఆస్పత్రిలో ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు.

‘కేసీఆర్ వేల కోట్ల రూపాయలను నమ్ముకుంటున్నారు. ప్రజల మీద కంటే ఓట్ల మీదే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువ. వేల కోట్ల అక్రమ సంపాదనను హుజురాబాద్‌లో పంచుతున్నరు. ఇప్పటికే 150 కోట్లు ఖర్చుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి. ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్‌కు కేసీఆర్ ఏనాడు దండ వేయలేదు. గొల్ల, కురుమల ఓట్ల కోసం బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వమే కడుతుంది. సీఎంఓలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అధికారి లేడు. హుజురాబాద్‌లోనే కాకుండా.. రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలి. అది కూడా హుజురాబాద్‌ నోటిఫికేషన్‌కు ముందే ఇవ్వాలి. కేసీఆర్ ప్రయత్నాలను ప్రజలు సహించరు. హుజురాబాద్‌లో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. ప్రజలు టీఆర్ఎస్‌ను నమ్మే స్థితిలో లేరు. హుజురాబాద్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తాను. నేను సీరియస్ రాజకీయ నాయకుడినే తప్ప డ్రామాలు ఆడేవాడిని కాదు. నేను డ్రామాలు ఆడుతానని వ్యాఖ్యానించిన హరీష్ రావు విజ్ఞతకే వదిలేశా. హరీశ్‌ రావు, నేను 18 ఏండ్లు కలసి పని చేసినం. డ్రామా చేస్తానో లేదో హరీశ్‌కే తెలుసు’ అని ఈటల అన్నారు.