పార్టీ పెట్ట.. వేరే పార్టీలో చేర..అప్పటిదాకా రిజైన్ చెయ్యను

పార్టీ పెట్ట.. వేరే పార్టీలో చేర..అప్పటిదాకా రిజైన్ చెయ్యను


హైదరాబాద్​, వెలుగు: కరోనా తగ్గే వరకు రిజైన్ చేయనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కరోనా తర్వాత పోటీ చేయాల్సి వస్తే హుజూరాబాద్​లో ఇండింపెండెంట్​గానే బరిలో దిగుతానని అన్నారు. ప్రస్తుతానికి పార్టీ పెట్టే ఆలోచన చేయలేదని, ఏ పార్టీలోకి పోవాలని కూడా ఆలోచించలేదని చెప్పారు. తానెప్పుడూ ఒంటరి కాలేదని, బావిలోంచి సముద్రంలో పడ్డానని అన్నారు. ‘జెడ్పీటీసీలు, ఎంపీపీలకు ఇన్నోవా కార్లు ఇస్తామని.. ఎంపీటీసీలు, సర్పంచ్‌‌లకు డబ్బులు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అటెండర్‌‌ నుంచి ఎమ్మార్వో దాకా, కానిస్టేబుల్‌‌ నుంచి ఎస్సై దాకా అందర్నీ ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశారు. వెంటాడినట్లు చేస్తున్నరు. అధికారులు, డబ్బులను నమ్ముకోలేదు. ప్రజలు, ధర్మం, కష్టాన్ని నమ్ముకున్న. చైతన్యానికి నిదర్శనమైన హుజురాబాద్‌‌ ప్రజలే నన్ను గెలిపిస్తరు’ అని చెప్పారు. ఇటీవలి వరుస పరిణామాలపై వీ6‌‌‌‌–వెలుగు ప్రతినిధికి ఈటల శనివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

కరీంనగర్, నిజామాబాద్​లో ఎందుకు ఓడిన్రు?

ఎమ్మెల్యే సభ్యత్వం కోసం భయపడే చిన్నోడిని కాదు. ఎమ్మెల్యే గిరి హుజూరాబాద్‌‌ ప్రజలు ఇచ్చిన భిక్ష. వాళ్లే గెలిపించారు. నేను కేసీఆర్‌‌ బొమ్మపై గెలిస్తే  కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌లో ఎంపీ సీట్లలో టీఆర్‌‌ఎస్‌‌ ఎందుకు ఓడింది. సిరిసిల్లలో 89 వేల మెజార్టీ నుంచి 5 వేలకు ఎందుకు పడిపోయింది. బీ ఫాం ఇచ్చిన, ఫొటో ఇచ్చిన అంటే నడవదు. సీఎం వచ్చి హుజూరాబాద్‌‌లో కూర్చున్నా.. డబ్బు రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలను పాతరేసి తెలంగాణ ఆత్మ గౌవరవాన్ని మళ్లీ నిలబెట్టేది హుజూరాబాద్‌‌ ప్రజలే. ఆచరించి చూపిస్త.

కష్టపడిన పుణ్యానికి ఇచ్చిన గిఫ్ట్‌‌

ఎంతో కష్టపడిన నన్ను భూదందా కేసులో ఇరికించిన్రు. 200..300 ఎకరాల భూమి అంటున్నరు. దేవరయాంజల్‌‌ భూములు కూడా దేవాలయ భూములు అంటున్నరు. భూముల వ్యవహారంలో సిట్టింగ్‌‌ జడ్జితో విచారణ జరపించాలి. నన్ను ఇట్ల చేయడంపై నా సతీమణి జమున గాయపడినట్లయ్యింది. ఆమె మాటల్లో చెప్పాలంటే.. ‘ఎవరైతే వేధిస్తున్నరో వారికి ఉసురు తగుతుంది. 20 ఏండ్ల నుంచి కుటుంబ సభ్యుల లెక్కన ఉండి ఇట్ల చేస్తరా? నిజాయితీ ఉంటే పిలిచి అడగాలి. అడిగే ఓపిక లేదా? నువ్వు కష్టపడిన పుణ్యానికి నీకిచ్చిన గిఫ్ట్‌‌ ఇది’ అని నా భార్య అంటోంది. 

కరోనాను ఆరోగ్యశ్రీలో ఇప్పటికైనా చేర్చండి

నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీలో కరోనా చేరిస్తే నాకు క్రెడిబిలిటీ వస్తుందని అనుకోవచ్చు. ఇప్పటికైనా చేర్చండి. ఫ్రీ ట్రీట్‌‌మెంట్‌‌ ఇవ్వండి. మెడికల్‌‌ కాలేజీల్లో బెడ్స్‌‌ ఉంటాయి. ఆక్సిజన్‌‌లు పెట్టి వాడుకుంటే బాగుంటుంది. టెస్టులు చేయకపోవడంతో డైరెక్ట్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ చేసుకుంటున్నరు. వాళ్ల దగ్గర పల్స్‌‌ ఆక్సీమీటర్‌‌ ఉండట్లేదు. పట్టించుకోక మూడ్రోజుల్లో లంగ్స్‌‌ ఇన్ఫెక్ట్‌‌ అయి హాస్పిటల్‌‌కు వస్తున్రు. నిత్యం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసే సీఎం ఉంటే రాజ్యం పరిపుష్టిగా, డెమోక్రటిక్‌‌గా ఉంటది. సీఎం తీరుతో నాతో సహా ఎంతో మంది ఆవేదన చెందారు. కేసీఆర్‌‌ మారుతారని ఆశిస్తున్న. నేను పోతే పోయిన.. బలైతే బలైన. నేనైతే సంతోషపడుతున్న.  ఈ ఫీడ్‌‌ బ్యాక్‌‌ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలకు మంచి వాతావరణం ఉండాలి. 

పుట్ట మధుతో పార్టీ సంబంధాలే

పదవుల దగ్గర సీఎంకు, నాకు చెడిపోలేదు. నేను ఓపెన్‌‌గా మాట్లాడిన. గొర్లు పేదలకు ఇవ్వమన్న. చదువుకునేటోళ్లకు ఎందుకుని ప్రశ్నించిన. ఈటల యుద్ధం చేయడు. హుజూరాబాద్‌‌, తెలంగాణ ప్రజలు యుద్ధం చేస్తరు. కులం, మతం, సెక్షన్లను నమ్ముకున్నోన్ని కాదు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతా. సందర్భాన్ని బట్టి ఈటల రాజేందర్ బ్లాస్ట్‌‌ అనేది తేలుతది. తెలంగాణ వచ్చాక వేల ఎకరాల ల్యాండ్‌‌ కన్వర్షన్‌‌ చేశారు. పుట్ట మధుతో పార్టీ సంబంధాలు మినహా ఏం లేవు. మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మెలిసి ఉండాలని సీఎం అన్నరు. అట్లనే ఉన్నం. రామోజీ ఫిల్మ్‌‌ సిటీ నుంచి రామానాయుడి స్టూడియో వరకు 4 వేల ఎకరాల భూమి ఉందని ఆరోపిస్తున్నరు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌‌ రెడ్డి ఆస్తులన్నీ నావే అని నీచమైన ఆరోపణలు చేస్తున్నరు. ఇలాంటి వాటిపై ఎప్పటికైనా తెలంగాణ సమాజం కన్నెర్ర చేస్తది.

కరెక్షన్‌‌ ఉండదు.. కటింగే

కేటీఆర్‌‌ నన్ను అత్యంత గౌరవించే వ్యక్తి. పార్టీలో ఇబ్బందైతే సరిచేసుకునుడు లేదు. ఈ మధ్య కేటీఆర్‌‌ కొంచెం కరెక్షన్‌‌ చేసే ప్రయత్నం చేశారు. టీఆర్‌‌ఎస్‌‌లో కరెక్షన్‌‌ ఉండదు. కటింగ్‌‌ ఉంటది. పార్టీలో కుట్ర పన్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ ఆ పని చేయలేదు. మంత్రి వర్గం నుంచి తీసే వరకు పార్టీ పెట్టే ఆలోచన, వేరే పార్టీలో చేరే యోచన లేదు. నేను సీఎం కావాలని చెప్పలేదు. కేటీఆర్‌‌ సీఎం కావాలని కోరుకున్న. నా భార్యకు, కొడుకు టికెట్‌‌ కావాలని ఎప్పుడు అడగలేదు. కొందరికి ఒకే ఇంట్లో మూడు మూడు పదవులున్నాయి.

అభిప్రాయలు చెప్తే కేసీఆర్‌‌కు గిట్టదు

గిట్టకపోయినా, స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పినా సీఎం కేసీఆర్‌‌కు ఓర్చుకునే వ్యక్తి కాదు. అన్నీ తానే చేసిన అనే వ్యక్తిగా చలామణి అవుతారు. నా మీద అకారణంగా విలన్‌‌గా, కబ్జాదారుడిగా చేసిన ప్రయత్నం అత్యంత జుగుబ్సాకరమైంది. మంత్రులుగా ఉన్నోళ్లను ప్రగతి భవన్‌‌కు పోతే బయటకు వెళ్లగొట్టిన ఘటనలు బాధ అనిపించినయ్. నేను ఏడాది కిందే మాట్లాడిన. మంత్రి పదవి రాదని వార్తలొస్తే నేను మోకరిల్లలే. ఎలక్షన్‌‌ ఓరియెంటెడ్‌‌ ప్రోగ్రామ్స్‌‌ చేయొద్దు. పీపుల్స్‌‌ ఓరియెంటెడ్‌‌ ప్రోగ్రామ్స్‌‌ చేయాలి.

ఉద్యోగాలు కల్పిస్తే నిరుద్యోగులు బతుకుతుండేగా

లక్షలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ఏండ్లుగా లైబ్రరీల్లో చదువుతున్నరు. ఉద్యోగాలు కల్పిస్తే వాళ్లు బతుకుతుండే కద. 30 ఏండ్ల దాటినా లైఫ్ సెటిల్‌‌, పెండ్లిలు కాకుండా బతుకుతున్న మాట వాస్తం కాదా? ఉద్యోగ నియామకాలు చేపట్టాలె. పథకాలు తెచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. అన్ని బాగానే ఉన్నా నిరుద్యోగం  
విషయంలో వెనకబడింది. ప్రైవేట్ కంపెనీల్లోనూ ఉద్యోగాలు దొరకలేదు. ఎక్కడి నుంచో వచ్చి ప్రైవేట్‌‌ కొలువులు చేసినా ఆంక్షలు పెట్టలేకపోయినం.