కేసీఆర్ ఓడిపోవాలనేదే జనం పంతం

కేసీఆర్ ఓడిపోవాలనేదే జనం పంతం
  • స్కీమ్‌‌ల అమలుకు సర్కారుతో కొట్లాడుత
  • దళితబంధు కింద ఇచ్చేది.. కేసీఆర్ ఇంట్ల సొమ్ము కాదు
  • హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
  • లిక్కర్ అమ్మిన డబ్బుతో ‘ధనిక రాష్ట్రం’ అనుడేందని ఫైర్​
  • ‘వీ6 ‑– వెలుగు’ ఇంటర్వ్యూలో ఈటల రాజేందర్, జమున

హైదరాబాద్, వెలుగు: సర్కారు హామీలు, పథకాల అమలు కోసం పోరాటం చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ చెప్పారు. ‘‘దళితబంధు కింద ఇచ్చేది ఎవడి సొమ్ము? నీ ఇంట్ల సొమ్ము కాదు.. నీ జాగీరు కాదు.. అదంతా ప్రజలది” అని కేసీఆర్‌‌పై ఫైర్ అయ్యారు. కేసీఆర్‌‌కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ‘‘లక్షల కోట్ల పెట్టుబడులతో కంపెనీలు వస్తున్నయని గొప్పలు చెబుతున్నవారు.. ఇక్కడి యువతకు స్కిల్స్ నేర్పించి ఉపాధి కల్పిస్తున్నారా? చదువుకున్న పిల్లలు ఉపాధి, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ మనది రిచెస్ట్ స్టేట్ అని చెబుతున్నరు” అని అన్నారు. 

‘‘మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతో రిచెస్ట్ స్టేట్ అనడం ఏంది? మద్యంతో భర్తలను కోల్పోయిన మహిళలుండటం ప్రోగ్రెసివ్ స్టేటా? కేసీఆర్ సోయి లేకుండా ప్రభుత్వాన్ని నడిపుతున్నరు. ఎలక్షన్ ఓరియంటెడ్ కాకుండా పీపుల్ ఓరియంటెడ్ స్టేట్​ కావాలె.. ప్రజా సేవ చేయాలనే తపన నాది. నాకు నా కుటుంబం, జనం సపోర్టు ఉంది. ప్రజాక్షేత్రంలో బాధ్యత నుంచి తప్పించుకోలేం. వారి కోసమే బతకాలి. వారి గొంతుకగానే పోరాడుత’’ అని ఈటల అన్నారు. హుజూరాబాద్‌‌ బైపోల్‌‌లో టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించిన తర్వాత ఈటల రాజేందర్ తన భార్య జమునతో కలిసి తొలిసారిగా ‘వీ6–వెలుగు’తో ముచ్చటించారు. 

ఎమ్మెల్యే పదవి కేసీఆర్ ఇయ్యలే
‘‘మంత్రి పదవి కేసీఆర్ ఇచ్చిండు. కానీ ఎమ్మెల్యే పదవి ఆయనియ్యలేదు. అదే నిజమైతే ఆయన కూతురు కవిత, బంధువు వినోద్‌‌ గెలవాలె కదా.. నేను జనం మనిషిని. అందుకే జనమే గెలిపించిన్రు. పార్టీ గుర్తు మీద గెలిచానని రాజీనామా చేయమన్నరు. నిబద్ధత, నిజాయితీ గల నాయకుడిగా రాజీనామా చేసిన. టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు టీఆర్ఎస్‌‌లో చేరి మంత్రులైన్రు. పూలమ్మిన కాడ, కట్టెలమ్మే పరిస్థితి రావొద్దని, బతికి చెడొద్దని రాజీనామా చేసిన’’ అని ఈటల అన్నారు. ‘‘క్యారెక్టర్ మంచిగలేకపోతే ఎప్పుడో పక్కనబెట్టాలి. సక్కగ చేసే సత్తా ఉంటేనే పదవి ఇస్తరు. ఇచ్చిన ప్రతిపని తప్పకుండా నేరవేర్చిన. ప్రజల విశ్వాసం పొందిన. అందుకే నాకు పదవులు, అవకాశాలు దక్కినయ్. కానీ కేసీఆర్ ఇలాకలో.. బానిసలెక్కనే పదవులున్నాయి. నీచమైన ఆరోపణలు చేసిన్రు. అన్యాయంగా ప్రవర్తించిన్రు. పద్దెనిమిదిన్నర ఏండ్లుగా జనం కాళ్లల్లో ముళ్లు ఇరిగితే పంటితో తీసే బిడ్డగా ఉన్న కాబట్టే గుండెల్లో పెట్టుకున్నరు. నన్ను ఓడించడానికి అధికార పార్టీ నేతలు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్లు ఖర్చు పెట్టిన్రు” అని ఆరోపించారు.

ప్రజల గొంతుకగా పోరాడుతా..
‘‘అసెంబ్లీలో రాజేందర్ ముఖం కనిపించొద్దని కేసీఆర్ హుకుం జారీ చేసిన్రు. కానీ ‘నీ ముఖం కాదయ్య.. రాజేందర్ ముఖం చూడాలి’ అని ప్రజలు నన్ను అసెంబ్లీకి పంపించిన్రు. ప్రజల గొంతుకగా పోరాడుతా” అని ఈటల అన్నారు. ‘‘కోవర్టుల విషయంలో అలర్ట్‌‌గా ఉన్నా. డబ్బులకు అమ్ముడుపోయి, ద్రోహం చేసినవాళ్లను దగ్గరికి రానిచ్చేది లేదు” అని స్పష్టం చేశారు. ‘‘2018 ఎన్నికల్లో 90 సీట్లను గెలుచుకున్నాక 3 నెలల పాటు మంత్రివర్గం లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనుడు కేసీఆర్. ఇంటర్నల్ డెమోక్రసీ లేదని అడిగితే.. ‘అదే ఉంటే నన్ను కోఠిలో అమ్ముతరు’ అని కేసీఆర్ అన్నడు. అది ఆయన నైజం. కేసీఆర్ ఓడిపోవాలనేదే జనం పంతం. రాచరికపు పాలన పోవాలని ఎదురు చూస్తున్నరు. రక్తంతో తడిసిన మట్టి ఇది. కేసీఆర్ మూల్యం చెల్లిస్తడు’’ అని చెప్పారు.

బీజేపీ నన్ను అక్కున చేర్చుకున్నది
‘‘టీఆర్ఎస్ విసిరేసినప్పుడు బీజేపీ నన్ను అక్కున చేర్చుకుంది. నా సేవకు బీజేపీని ప్లాట్ ఫాంగా ఎంచుకున్నా.. పార్టీ అండగా ఉంది. ఇకపై ఉంటుందని ఆశిస్తున్న” అని ఈటల చెప్పారు. ‘‘కేసీఆర్, కొడుకు, కూతురు లెక్క.. నా భార్యా పిల్లలు టిక్కెట్లు అడగలేదు. వాళ్లు రాజకీయాల్లోకి రారు” అని తెలిపారు. కాగా, ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గన్‌‌‌‌ పార్క్‌‌‌‌లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత నాంపల్లిలోని పార్టీ ఆఫీసుకు ఈటల చేరుకోనున్నారు.

ఆస్తులమ్మి అయినా కొట్లాడాలనుకున్నం: జమున

‘‘టీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కేసీఆర్‌‌‌‌కు తమ్ముడి లెక్క ఈటల రాజేందర్ ఉంటుండె. 18 ఏండ్లు చాకిరి చేయించుకున్నరు. ఉద్యమంలో బిజీగా ఉండి పిల్లలకూ టైం ఇయ్యకపోతుండె. మా ఆయనకు ఉద్యమం అన్నా, కేసీఆర్ అన్నా అంత ఇష్టం. అంత నమ్మిన కుటుంబాన్ని.. అన్నేండ్లు చాకిరి చేయించుకొని.. రెండు గంటలల్ల.. భూమి కబ్జా చేసిండ్రని మంత్రి పదవి నుంచి తీసేసిన్రు. ఆ కసితోనే 110 గ్రామాలు తిరిగిన. ‘‘కేసీఆర్ మీకు అన్యాయం చేసిన్రు.. ఎట్ల తట్టుకున్నరు బిడ్డా’ అని ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నరు. మేం ఆస్తులు పోగొట్టుకొని ఉంటే.. భూకబ్జాదారుడని అన్నరు. ప్రజలందరు అన్యాయం జరిగిందని అనుకున్నరు. అందుకే గెలిపించిన్రు’’ అని జమున అన్నారు. ‘‘మేం అసైన్డ్ భూములు కబ్జా చేసినం అని ప్రచారం చేసిన్రు. మహిళా సాధికారత మీద మాట్లాడే కేసీఆరే నన్ను ఇబ్బంది పెట్టిన్రు” అని అన్నారు. ‘‘మాది కడుపులో నుంచి వచ్చిన ఆక్రోశమే. ఇప్పుడు ఉద్యమకారులు కేసీఆర్‌‌‌‌కు అవసరం లేదు. అందుకే మా ఆయన్ను పక్కనపెట్టిన్రు. అందుకే ఆస్తులు అమ్మైనా కేసీఆర్‌‌‌‌తో పోరాడాలని మా ఆయనకు చెప్పిన” అని తెలిపారు. ‘‘నేను, నా పిల్లలు రాజకీయాల్లో అడుగుపెట్టం. మా ఆయనకు అండగా ఉంటం. నలుగురికి మంచి చేయాలన్నదే మా తపన. మహిళలు, నిరుద్యోగ యువత కోసం కుటీర పరిశ్రమ పెట్టాలని ఉంది” అని చెప్పారు.