హరీశ్ ని ఉద్యోగాలడిగిందని యువతిని అలా కొడతారా?

హరీశ్ ని ఉద్యోగాలడిగిందని యువతిని అలా కొడతారా?

కరీంనగర్: హుజురాబాద్ మండలం శాలపల్లిలోని ఇందిరానగర్‎లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. హరీశ్ రావుని ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి అడిగిందని యువతిని ఇష్టం వచ్చినట్లు కొడతారా అని ఈటల మండిపడ్డారు. అన్ని కులాల వారికి దళితబంధు లాంటి స్కీం పెట్టాలన్న తాను.. దళితబంధు ఆపాలని ఫిర్యాదు చేస్తానా అని ప్రశ్నించారు.

‘పెద్ద పెద్ద స్కీంలకు శాలపల్లి కేంద్రంగా మారింది. శాలపల్లిలో దళితబంధు ఆరంభించి 65-66 రోజులైంది. ఈ స్కీం మొదట ఇక్కడే లాంచ్ చేయలేదు. భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ఫస్ట్ ప్రారంభించారు. ఎన్నికల కోడ్ వస్తుందన్న ఆలోచనతో అక్కడ మొదలుపెట్టారు. ఆయనకు నిజంగానే ఈ పథకంపై చిత్తశుద్ధి ఉందని నేను కూడా భావించా. దళితబంధు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశాను. కలెక్టర్ల పెత్తనం, బ్యాంకుల పెత్తనం ఉండొద్దని కోరింది నేనే. హుజురాబాద్ ప్రజలపై ప్రేమతో ఇచ్చావో, ఓట్లపై ప్రేమతో ఇచ్చావో గానీ.... తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాను. ఎప్పటిలోగా ఇస్తావో చెప్పాలని కోరాను. అన్ని కులాల్లోని పేదలకు కూడా ఇలాంటి స్కీం పెట్టాలని కోరింది నేను. అటువంటిది దళితబంధు నేను వద్దన్నట్లు దొంగ ఉత్తరం కేసీఆర్ సృష్టించాడు. నేను లెటర్ రాస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించాను. దళితబంధుపై దొంగ ఉత్తరాలు సృష్టించి ఆపే ప్రయత్నం చేయవద్దని కోరాను. ఇప్పటికే ఎన్నికల అధికారులు కుడా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. కానీ రాత్రి మళ్లీ కొత్త నాటకానికి తెరలేపాడు. నేను మళ్లీ ఎన్నికల కమిషన్‎కు దళితబంధు వద్దంటూ ఫిర్యాదు చేశానని ప్రచారం చేస్తున్నారు. మా దిష్టిబొమ్మలు కాలబెడుతున్నారు. నీవు తలకిందకు పెట్టి, కాళ్లు పైకి పెట్టి జపం చేసినా నీకు ఓట్లు వేయరని చెప్పాను. గత 5 నెలల 20 రోజులుగా నేను తిరుగుతున్నా. ఎన్నడూ లేని భయం ప్రజల్లో ఆవరించింది. ఏ పథకం కావాలన్నా.. టీఆర్ఎస్‎కు ఓటు వేయాలని, బీజేపీ వెంట ఉండొద్దని బెదిరిస్తున్నారు. నచ్చిన వ్యక్తికి ఓటేసే హక్కు, నచ్చిన పార్టీలో ఉండే హక్కు అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఇచ్చింది. ఏ రాజ్యాంగం ప్రకారం నీకు పదవి ఇచ్చారో..  ఆ ప్రజలే నీవు మాకు వద్దని చెబుతున్నారు. నీవల్ల పేదరికం పెరిగిందని, అశాంతి ప్రభలుతోందని ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ మాత్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు. ఆయన పెద్దమనిషి అయుండి.. ఆయనను అడిగేవాళ్లు లేకుండా పోయారు. హుజురాబాద్‎లో కేసీఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత.. తెలంగాణ మొత్తంలోనూ ఓటమి తప్పదు. నేను శపించడానికి రుషిని కాకపోవచ్చు. నేను పూజలు చేసే పూజారిని కాకపోవచ్చు. కానీ ప్రజలంతా కేసీఆర్ చెప్పే మాటలకు, చేతలకు పొంతనలేదని అంటున్నారు. మాటలు చెప్పి, భయభ్రాంతులకు గురిచేసి పాలన సాగిస్తున్నాడు. ఆయన పాలనలో అంతా డొల్లతనమే. 

ఆర్థికంగా రాష్ట్రం కుప్పకూలి పేదరికం పెరిగిపోయింది. ఉద్యోగాలు వస్తాయని 1200 మంది అమరులైతే.. ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. పిల్లలకు ఉద్యోగాలు వస్తే తల్లిదండ్రులు మురిసిపోవాల్సింది పోయి.. కూలీ పని చేసి పిల్లలకు పెడుతున్నారు. ఎన్నికలప్పుడే నోటిఫికేషన్లు గుర్తొస్తాయి. ఎన్నికలప్పుడే దళితులు గుర్తుకు వస్తారు. కేసీఆర్ ప్రజలు మెచ్చే పద్ధతిలో పనిచేయడం లేదు. హరీశ్ రావు మీటింగ్ దగ్గర ఉద్యోగాలు ఎప్పుడిస్తారని నిరోషా అని యువతి ప్రశ్నించింది. అడిగినందుకు ఆమెను కొట్టారు. చివరకు ఆమెకు పిచ్చిలేచిందని, మెంటల్ డిజార్డర్ ఉందని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి. ఈ సర్కారు ఉంటది పోతది. ఇది నిజాం సర్కారు కాదు. తాతకు, తండ్రికి, కొడుకుకు, మనవడికి రాజ్యాధికారం అప్పగించడానికి ఐదేళ్ల కోసం మాత్రమే వీళ్లకు అధికారం ఉంది. కేసులు పెట్టించే అధికారం, కొట్టించే అధికారం లేదు. ఇలాంటి సంఘటనలు గుర్తుంచుకుని సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాతపెడతారు. నీకు నిజాయితీ ఉంటే, దమ్ముంటే.. ప్రజలకు మేలు చేసి నాలుగు ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయి. టక్కు టమారా విద్యలతో, పిచ్చివేషాలతో ఇంకా కొనసాగాలనుకుంటే ఎళ్లవేళలా సాగదు. ఊర్లను బార్లుగా మార్చారు. నాయకులను వెలగట్టి కొంటున్నారు. ఓటుకు 20 వేలు, 30 వేలతో బేరం చేస్తున్నారు. ఇలాంటివి ఎన్ని చేసినా .. ‘మీ ఇంట్లో నుంచి ఇస్తున్నారా’ అని ప్రజలు అడుగుతున్నారు. మీ ముఖాలు చెల్లుబాటు అవడం లేదు.  నా పేరు వాడుకుని ఓట్లు అడుక్కుంటున్నారు. కొప్పుల ఈశ్వర్, సుమన్ లాంటి వాళ్లు.. నీచంగా మాట్లాడుతున్నారు. నాకు నేనే దాడి చేయించుకుని సానుభూతి కోసం ఓట్లు అడుక్కుంటానని ప్రచారం చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా.. ఏం మాట్లాడినా ప్రజలు నమ్మరు’ అని ఈటల అన్నారు.

For More News..

మన సోల్జర్స్ చనిపోతుంటే.. పాక్‎తో టీ20 మ్యాచ్ ఆడతారా?

ఈటల రాజేందర్ గెలిస్తే ఏంవస్తుందో చెప్పాలి?