ఉగాది పచ్చడి 9 రోజులు తినాల్నట!

ఉగాది పచ్చడి 9 రోజులు తినాల్నట!

మహాముత్తారం, వెలుగు: వసంత గమన శుభవేళ..  పచ్చగా కళకళలాడే ప్రకృతి పరంగా..  ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశంతో..  చైత్ర శుద్ధ పాడ్యమి మంగళవారం రోజున ఉగాది పండుగ కాలగమనం ఆరంభమవుతుంది. ప్రమాదాలు,  ప్రమోదాలు కలబోతగా గడిచిపోయిన తెలుగు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. రాబోయే ఏడాదిలో నవ్య కాంతుల్ని నింపాలని  మరో వసంతానికి స్వాగతం పలుకుతారు. రైతులు కొత్తగా చేన్లలో సాలు పెట్టుకుంటారు. పంచాంగం వింటారు.

ఉగాది పచ్చడి మహాఔషధం..!

ఉగాది పచ్చడి ఒక మహాఔషధమని పెద్దలు చెబుతుంటారు. ఈ ఉగాది పచ్చడిని శ్రీరామ నవమి వరకూ లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజూ తీసుకోవాలి. అలా 9 లేదా15 రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటారు. ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులో ఉన్న నులిపురుగులను చంపేస్తుంది. వేపగాలి ఆటలమ్మ, అమ్మోరు మొదలైన వ్యాధులను దగ్గరకు రానీయదు. మామిడి యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉన్నది. ఇది కఫము, వాతము, పైత్యాలనే మూడు దోషాలను అదుపులో ఉంచుతుంది. మనకు వచ్చే జబ్బుల్లో చాలా వరకూ వీటివల్లే వస్తాయి.

మంచి ఆశయాలతో ముందుకు సాగాలి

'శతాయుర్వజ్ర దేవయ సర్వ సంపత్రాయచ.. సర్వతిష్ట వినాశయ నిబంకదళ బక్షణమ్​'  అనే శ్లోకం పఠించి ఉగాది ప్రసాదాన్ని స్వీకరించాలి.  పంచాంగ శ్రవణం వినాలి.  మంచి ఆశయాలతో ముందడుగు వేయాలి.  ఈ రోజున పంచాంగాన్ని విన్న పక్షంలో ఏ గ్రహం మనకి అనుకూలంగా లేదో,  ఎవరు మనకి సహాయకులో తెలిసి, ఏయే  కష్ట నష్టాలో  తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకోగలుగుతాం.
- పనకంటి ఫణీంద్ర శర్మ,  అర్చకుడు,  శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం,  కాళేశ్వరం