వణికిస్తున్న ఎబోలా.. ఉగాండా, కాంగోలో 88 మందిని చంపిన మందులేని వ్యాధి..

వణికిస్తున్న ఎబోలా.. ఉగాండా, కాంగోలో 88 మందిని చంపిన మందులేని వ్యాధి..
  • ఇంటర్నేషనల్‌‌ హెల్త్‌‌ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌‌వో

ఆఫ్రికా దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్‌‌ విజృంభిస్తున్నది. వందలాదిమంది ఈ వ్యాధి బారిన పడుతుండటం, పదుల సంఖ్యలో జనం మరణిస్తుండటంతో వైరస్‌‌ వ్యాప్తిని వరల్డ్‌‌ హెల్త్‌‌ ఆర్గనైజైషన్‌‌ (డబ్ల్యూహెచ్‌‌వో) గ్లోబల్‌‌ హెల్త్‌‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ వైరస్‌‌కు ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్‌‌, ప్రత్యేక చికిత్స లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటివరకు 330కి పైగా అనుమానిత కేసులు నమోదుకాగా 88 మంది మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్‌‌వో తెలిపింది.

జెనీవా: ఆఫ్రికా దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్‌‌సీ), ఉగాండాలో ఎబోలా వైరస్‌‌ విజృంభిస్తోంది. వందలాదిమంది ఎబోలా బారిన పడుతుండటం, పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తుండటంతో వైరస్‌‌ వ్యాప్తిని వరల్డ్‌‌ హెల్త్‌‌ ఆర్గనైజైషన్‌‌ గ్లోబల్‌‌ హెల్త్‌‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్‌‌ ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్‌‌కు చెందినదిగా డాక్టర్లు గుర్తించారు. ఈ వైరస్‌‌కు ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్‌‌ లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌‌ మరింత విస్తరించకుండా టెస్టింగ్‌‌, పర్యవేక్షణ, వైద్య వ్యవస్థలను బలోపేతం చేయాలని డబ్ల్యూహెచ్‌‌వో ప్రపంచ దేశాలకు సూచించింది.

  • ఇటూరి ప్రావిన్స్‌‌లో ఎక్కువ కేసులు.. 

కాంగో తూర్పు ప్రాంతంలోని ఇటురి ప్రావిన్స్‌‌లో అనుమానిత, నిర్ధారిత కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 330కి పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వైరస్‌‌ బారిన పడి 88 మంది మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్‌‌వో తెలిపింది. కాంగో నుంచి ప్రయాణించి ఉగాండా చేరుకున్న ఇద్దరికి వైరస్‌‌ పాజిటివ్‌‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ వైరస్‌‌ ప్రధాన నగరాలకు వ్యాపించే ప్రమాదం పెరగడంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. 

జనాభా ఎక్కువగా ఉన్న సిటీల్లో వ్యాధి వ్యాప్తిని కంట్రోల్‌‌ చేయడం కష్టతరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌‌వో, ఆఫ్రికన్‌‌ ఆరోగ్య సంస్థలు కలిసి ఇప్పటికే ఆస్పత్రుల్లో స్క్రీనింగ్‌‌, కాంటాక్ట్ ట్రేసింగ్‌‌, అత్యవసర వైద్య సరఫరాలపై చర్యలు చేపట్టాయి. కాంగో, ఉగాండా ప్రభుత్వాలు కాంటాక్ట్‌‌ ట్రేసింగ్‌‌, ప్రయాణికుల స్క్రీనింగ్, ఐసోలేషన్‌‌ కేంద్రాల ఏర్పాటు, ప్రజల్లో అవేర్‌‌‌‌నెస్‌‌ కార్యక్రమాలు ప్రారంభించాయి.

  • ఎలా వ్యాపిస్తుందంటే..

మనుషులతో పాటు జంతువులకూ సోకే ప్రమాదకర వైరస్​. 1976లో కాంగోలోని ఎబోలా నది సమీపంలో దీనిని తొలిసారి గుర్తించారు. వైరస్‌‌ సోకినవారిలో జ్వరం, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. బాధితుల రక్తం, చెమట, లాలాజలం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.