
- బీఆర్‌ఎస్‌కు 277, కాంగ్రెస్ 185, బీజేపీకి 79 నిమిషాలు
న్యూఢిల్లీ, వెలుగు:అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు రాష్ట్రంలోని పలు పార్టీలకు దూరదర్శన్ (డీడీ), ఆలిండియా రేడియోల్లో ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమయం కేటాయించింది. ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకూ ప్రచార సమయాన్ని శుక్రవారం నిర్ధారించింది. తెలంగాణలో గుర్తింపు పొందిన నేషనల్, రీజినల్ పార్టీలకు కలిపి బ్రాడ్‌కాస్ట్‌కు 898 నిమిషాలు, టెలికాస్ట్‌కు 898 నిమిషాలను వేర్వేరుగా కేటాయించినట్లు అండర్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ వెల్లడించారు.
స్టేట్ లెవల్ లోని ప్రసార భారతి కేంద్రంలో ఆయా పార్టీలకు కేటాయించిన సమయాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. బీఆర్ఎస్ కు 277 నిమిషాలు కేటాయిస్తూ.. ఆ సమయాన్ని ఐదు నిమిషా లకు ఒక స్లాట్ చొప్పున 55 స్లాట్లుగా విభజించింది. కాంగ్రెస్ కు 185 నిమిషాలు (37 స్లాట్లు), బీజేపీకి 79 నిమిషాల(15 స్లాట్లు) టైమ్ ఇచ్చింది. అలాగే టీడీపీకి 62 నిమిషాలు, ఏఐఎంఐఎంకు 58 , బీఎస్పీకి 55, సీపీఐ(ఎం)కు 47 నిమిషాలు కేటాయించింది.
వైఎస్సార్ సీపీ, ఆప్, ఎన్ పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ)లకు 45 నిమిషాల చొప్పున 9 స్లాట్లుగా బ్రాడ్ కాస్ట్, టెలికాస్ట్ కు విడివిడిగా టైమ్ ఇచ్చింది. అన్ని పార్టీలు పోలింగ్‌కు 48 గంటల ముందే ఈ ప్రచారాన్ని నిలిపివేయాలని కోరింది.